సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు ప్రభుత్వం చేస్తే ఒప్పు.. అప్పుడు కాగ్ ఎత్తి చూపినా తప్పులు కనిపించవు.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తే అంతా తప్పు’.. ఇదా రామోజీ గురివింద నీతి అంటూ ఆర్థికశాఖ వర్గాలు విస్తుపోతున్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏటా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారని, కేటాయింపుల్లేకుండానే ఖర్చుచేశారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు ఎత్తి చూపినా ఆ ఐదేళ్లలో ఈనాడుకు అసలు కనిపించనే లేదు. ఐదేళ్లలో ఒక్కరోజు కూడా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారని ఈనాడు ఒక్క ముక్కా రాయలేదు. ఇప్పుడే ఏదో ఘోరం జరిగిపోతోందంటూ.. ఇప్పుడే కొత్తగా బడ్జెట్ కేటాయింపులకు మించి వ్యయం చేశారంటూ ఈనాడు రాసిన కథనాన్ని చూసి ఆర్థికశాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
అస్మదీయుడైన చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలాగ.. తస్మదీయులైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉంటే మరోలా ఈనాడు కథనాలు రాయడం చూస్తుంటే.. ఎంత వివక్ష, పక్షపాతంతో ఉందో అర్థం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నాయి. ఏటా బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై కాగ్ నివేదికలు రూపొందించే ముందు ఆర్థికశాఖను వివరణ కోరుతూ లేఖలు రాయడం సాధారణమేనని, ఇది ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడే కొత్తగా కాగ్ ఆర్థిక శాఖకు లేఖ రాసినట్లు, గతంలో ఎప్పుడూ లేఖ రాయనట్లు ఈనాడు కథనం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బాబు ప్రభుత్వ హయాంలో ఈనాడు ఇలాంటి వార్త ఒక్కటి కూడా రాయలేదని, ఇప్పుడే ఎందుకు రాసిందో అందరికీ అర్థమవుతోందని పేర్కొన్నారు.
బాబు హయాంలో దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్న కాగ్
► చంద్రబాబు ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు బడ్జెట్ కేటాయింపులకు మించి రూ.1,62,828.70 కోట్లు వ్యయం చేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఈ వ్యయంపై కాగ్ ఏమందంటే.. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన కేటాయింపులకు మించి అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృత మవుతున్నాయి. ఇది శాసనసభ అభీష్టానికి విరుద్ధం కనుక దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఊహించిన పరిమితులను దాటి వేస్ అండ్ అడ్వాన్స్‌లు తీసుకోవడం వలన గత ఐదేళ్లలో కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు అవుతూనే ఉంది. అదనపు నిధులు అవసరమని భావిస్తే శాసనసభ నుంచి ముందస్తు ఆమోదం తీసుకోవాలి. ఈ అంశాన్ని గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నివేదికలోనూ ప్రస్తావిస్తున్నప్పటికీ తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
► చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015–16, 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపుల్లేకుండానే వరుసగా రూ.1,592.76 కోట్లు, రూ.1,053.08 కోట్లు, రూ.2,790.08 కోట్లు వ్యయం చేశారని కాగ్ నివేదికలు స్పష్టం చేశాయి. దీనిపై కాగ్ ఏమందంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్ ప్రకారం నిధుల కేటాయింపు జరగకుండా ఏదైనా పథకం, సేవపై ఖర్చు చేయకూడదు. ఈ చర్య బడ్జెట్ ప్రక్రియ, శాసన సంబంధిత నియంత్రణల గౌరవాన్ని భంగపరచింది.
► చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు కేటాయింపుల మేరకు వ్యయం చేయకుండా పెద్ద ఎత్తున మిగులును చూపెడుతోందని కాగ్ నివేదిక ఎత్తి చూపింది. ఈ మిగుళ్లు బడ్జెట్ ప్రతిపాదనల్లో కచ్చితత్వం, విశ్వసనీయతలపై సందేహాలను రేకిత్తిస్తున్నాయని కాగ్ స్పష్టం చేసింది. ఉదాహరణకు 2018–19లో సాంఘిక, బీసీ సంక్షేమం, వ్యవసాయం, పాఠశాల విద్య, రహదారులు తదితర 11 అంశాల్లో కేటాయింపుల్లో రూ.2 వేల కోట్లకు మించి వ్యయం చేయకపోగా.. రూ.47,670.66 కోట్లు మిగిలి ఉన్నాయని కాగ్ ఎత్తి చూపింది.
Comments
Please login to add a commentAdd a comment