చిత్తూరు జిల్లా: ఇంటి వద్ద కార్తీక శుక్రవారం సందర్భంగా వెలిగించిన దీపం వారి ఇంటినే కాల్చేసింది. ఈ ఘటన మండలంలోని కాగతి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటర్ కాలిపోగా.. సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామస్తుల కథనం.. పుంగనూరు–బోయకొండ ప్రధాన రహదారిలో కాగతి ఉంది.
రోడ్డు పక్కన ఎల్.ఉదయ్‌కుమార్, తల్లి శారదమ్మ కలిసి చిల్లర అంగడి నిర్వహిస్తున్నారు. వీటితోపాటు పెట్రోల్, గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో కార్తీక శుక్రవారం కావడంతో షాపు, ఇంటి గడపలో దీపం వెలిగించి పెట్టారు. పెట్రోల్ బాటిళ్లు, క్యాన్‌తోపాటు బైక్ వరండాలో ఉంచారు. దీపం నుంచి పెట్రోల్‌కు మంటలు చెలరేగి బైక్‌కు వ్యాపించాయి. మంటలు ఎగసి పడడంతోపాటు పొగ కమ్మేసింది. మంటలను అదపుచేసేందుకు స్థానికులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్న భయంతో పరుగులు తీశారు. తీరా ఉదయ్‌కుమార్ ఇంట్లోనే ఉండిపోవడంతో గ్రామస్తులు, యువకులు సాహసం చేసి ఇంటి కిటికీలు ధ్వసం చేసి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అతనికి స్వల్పగాయాలు కాగా.. ప్రాథమిక చికిత్స అందించారు. ఇంట్లోని సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, కొయ్య సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. ఈ ఘటనతో గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల నివాసమున్నవారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. పుంగనూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


