మహా విశాఖలో తొలి క్లాక్ టవర్
జగదాంబ జంక్షన్‌కి కొత్తరూపు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.80 కోట్లతో పనులు
గడియారాలు ఏర్పాటు చేసిన ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థ
నిత్యం జన సంద్రంతో కిటకిటలాడుతూ ఉండే జగదాంబ జంక్షన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయంగా జంక్షన్‌ను తీర్చిదిద్దింది. ముఖ్యంగా ఈ జంక్షన్‌కు కళ్లు చెదిరే అందాన్ని తీసుకొచ్చింది క్లాక్ టవర్. రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ పాతనగరానికి కొత్త జీవం పోసింది.
భారీ గడియారాలు నగర వాసులకు కాలాన్ని గుర్తు చేస్తూనే.. ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. రాత్రి వేళల్లో ఈ క్లాక్ టవర్‌ను చూడటం ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తోంది. ఇక్కడ భారీ గడియారాలను ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేసింది. అసలు ఈ గడియారాల ప్రత్యేక ఏమిటి? మెడివల్ సంస్థ కథేంటి.? ఆ వివరాలను ఓ సారి చదివేద్దామా.?
– సాక్షి, విశాఖపట్నం
పూర్వ కాలంలో సూర్యుడు ఎండ వల్ల ఏర్పడే నీడని బట్టి టైమ్ తెలుసుకునేవారు. నిజాం నవాబులు, బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు వారి కింద పనిచేసే వారికి, సైనికులకు చేతి గడియారాలు ఉండేవి కాదు. వారికి సమయం తెలియజేసేందుకు ప్రధాన కేంద్రాల వద్ద క్లాక్ టవర్లు నిర్మించారు. సమయానికి విధులకు రాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఈ క్లాక్ టవర్లు ఉపయోగపడేవి.
క్రమంగా.. ప్రజలంతా ప్రధాన జంక్షన్లలో ఉండే క్లాక్ టవర్ల వద్దకు వచ్చి టైమ్ తెలుసుకునేవారు. హైదరాబాద్ మహానగరంలో నిజాంలు, బ్రిటిషర్లు మొత్తం 12 క్లాక్ టవర్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు కేవలం అమెరికా, లండన్‌లో మాత్రమే క్లాక్ టవర్లు కనిపించేవి. అప్పట్లో క్లాక్ టవర్లలోని గడియారాలన్నీ లండన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. క్రమంగా.. భారత్‌లోనూ గడియారాలు తయారవడం ప్రారంభమైంది.
నగరంలో తొలి క్లాక్ టవర్
భారీ గడియారాలు మహా విశాఖ నగరానికి కొత్తేం కాదు. భీమిలిలో 18వ శతాబ్దంలో డచ్ వారు నిర్మించిన గంట స్తంభం రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైంది. 1923లో అప్పటి మద్రాస్ ప్రావెన్సీ ముఖ్యమంత్రి దివాన్ బహద్దూర్ పానుగంటి రామయ్యంగార్ ఆధ్వర్యంలో కేజీహెచ్‌లో భారీ గడియారాలు ఏర్పాటు చేశారు. 1926లో ఏయూ ఫిజిక్స్ విభాగంలో జైపూర్ మహారాజా భారీ గడియారాన్ని ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్, రాజస్థాన్, ఢిల్లీ నగరాల్లో మాదిరిగా.. క్లాక్ టవర్లు మాత్రం విశాఖలో లేవు. జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసిందే మొట్టమొదటి అతి పెద్ద క్లాక్ టవర్‌గా చెప్పవచ్చు.
గత ప్రభుత్వ హయాంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ నగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. ఆహ్లాదంలోనూ, అభివృద్ధిలోనూ కొత్త వైజాగ్ పరిచయమైంది. ఎటు చూసినా పార్కులు, ప్రధాన సర్కిళ్లలో సరికొత్త డిజైన్లతో ఫౌంటెన్స్.. ఇలా విభిన్న విశాఖ కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే జగదాంబ జంక్షన్‌లో.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా 2023 నవంబర్‌లో క్లాక్ టవర్ నిర్మాణానికి మేయర్ గొలగాని హరివెంకటకుమారి శంకుస్థాపన చేశారు. రూ.2.80 కోట్లతో నిర్మించిన ఈ క్లాక్ టవర్‌లో 4 గడియారాల ఏర్పాటు పనులను మాత్రం ఢిల్లీకి చెందిన మెడివల్ ఇండియా సంస్థకు అప్పగించారు. 60 అడుగుల పొడవైన ఈ టవర్‌తో పాటు అద్భుతమైన ల్యాండ్ స్కేపింగ్‌తో కూడిన ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేశారు.
ప్రధాన నగరాల్లో ‘మెడివల్’ క్లాక్స్
చరిత్ర పుటల్లో తమకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఈ సౌధ గడియారాలు తయారు చేసిన మెడివల్ ఇండియా సంస్థ ఢిల్లీకి చెందింది. దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్స్, భారీ గడియారాలన్నీ మెడివల్ ఇండియా సంస్థకు చెందినవే. ఢిల్లీ, యూపీలోని ఖతౌలీ, ఐఐటీ రూర్కెలా, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, సిమ్లా, ముస్సోరీ, పానిపట్, బెంగళూరు, గుర్‌గ్రామ్, జైపూర్, కోల్‌కతా, చెన్నై, డెహ్రాడూన్, రాజస్థాన్, అరుణాచల్‌ప్రదేశ్.. ఇలా ప్రతి నగరానికీ అక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్లుగా గడియారాలు అందించడం వీరి ప్రత్యేకత.
కొన్ని కోట్ల మందికి వీరి గడియారాలు టైమ్‌ను చూపిస్తున్నాయి. ప్రతి గడియారంలోనూ ‘సీటీటీ’ ఉండేలా చూసుకోవడమే వీరి ప్రత్యేకత. సీ అంటే క్రాఫ్ట్‌మెన్ షిప్, టీ అంటే ట్రెడిషన్, టీ అంటే టెక్నాలజీతో తీర్చిదిద్దుతారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన నాలుగు గడియారాలు డిజిటల్ కంట్రోల్‌తో పాటు సరైన సమయాన్ని చూపించేలా జీపీఎస్ ద్వారా అనుసంధానం చేశారు.
టవర్ క్లాక్ కంట్రోలర్ ద్వారా నాలుగు గడియారాలను నడిపిస్తారు. విద్యుత్ సరఫరాలో ఏదైనా లోపాలు తలెత్తితే.. 48 నుంచి 72 గంటల పాటు నిర్విరామంగా నడిచేలా ప్రతి గడియారంలోనూ ఇన్‌బిల్ట్ పవర్ బ్యాకప్ ఉంది. 20 రకాలుగా క్లాక్ డయల్స్ తయారు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. క్లాక్ టవర్‌తో జంక్షన్‌కు కొత్త రూపు తీసుకొచ్చిన మెడివల్ ఇండియా పనితనానికి వైజాగ్ నగరం సెల్యూట్ చేస్తూ మురిసిపోతోంది.
నగర అభిరుచికి తగ్గట్టుగా తయారు చేస్తాం
దేశంలోని ప్రతి నగరంలోనూ దాదాపు మా సంస్థకు చెందిన గడియారాలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా క్లాక్ టవర్ ఏర్పాటు చేశాం. ముందుగా వైజాగ్ విశిష్టత తెలుసుకున్నాం. ఏ తరహా డిజైన్ ఇక్కడ సరిపోతుందో అంచనా వేసి.. నగర అభిరుచికి తగ్గట్లుగా తయారు చేశాం. భారతీయ సంప్రదాయం, చరిత్ర మిళితమయ్యేలా నైపుణ్యం కలిగిన హస్త కళాకారులతో గడియారాలు తయారు చేస్తుంటాం. చాలాకాలం మన్నికగా ఉండేలా.. ఇక్కడ సముద్రపు గాలులను తట్టుకుని నిలబడేలా క్లాక్ టవర్‌లోని వాచ్‌లు రూపొందించాం. –అంబికా బక్షి, మెడివల్ ఇండియా సీఈవో
Comments
Please login to add a commentAdd a comment