సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. నగరాలు, పట్టణాలతో పాటు మారుమూల పల్లెవాసులకు సైతం ఏరోజుకారోజు తాజా చేపలు, రొయ్యలను సరసమైన ధరలకు అందుబాటులో తీసుకెళ్లాలని సంకల్పించింది. తోపుడు బండ్ల ద్వారా కూరగాయలు ఇంటివద్దకు తీసుకెళ్తున్న తీరులో మొబైల్ వాహనాల్లో చేపలు, రొయ్యలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. ప్రొటీన్లు, విటమిన్లు, క్యాల్షియం దండిగా ఉండే మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంచడం ద్వారా ప్రజల్లో వ్యాధినిరోధకశక్తిని పెంపొందింప చేయాలని, మత్స్యకారులు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
రాష్ట్రంలో తలసరి వినియోగం ఎనిమిది కిలోలే..
రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయి. తీరం వెంబడి 31,147 ఫిషింగ్ క్రాప్ట్స్ ద్వారా సముద్ర మత్స్యవేట సాగుతోంది. రాష్ట్రంలో 2,64,774 ఎకరాల్లో చేపలు, 2,25,406 ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నాయి. ఆక్వా, మెరైన్ ఉత్పత్తులు కలిపి ఏటా 31,50,486 మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తాయి. వీటిలో 24,02,610 టన్నులు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, 3,49,842 టన్నులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలిన 3,98,034 టన్నులు (12.63 శాతం) మాత్రమే రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల తలసరి వినియోగం అంతర్జాతీయంగా 20 నుంచి 30 కిలోలు, జాతీయంగా 7.5 నుంచి 10 కిలోలు ఉండగా మన రాష్ట్రంలో 8 కిలోలు మాత్రమే. మన రాష్ట్రంలో తలసరి వినియోగాన్ని 20 కిలోలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తొలిదశలో 25 హబ్‌లు
చేపలు, రొయ్యల స్థానిక వినియోగం పెంపునకు రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ప్రతి హబ్ పరిధిలో రూ.20 లక్షల విలువైన ఐదు, రూ.10 లక్షల విలువైన 10, రూ.మూడులక్షల విలువైన 10 వంతున మొత్తం 25 స్పోక్స్ (కియోస్క్‌లు) ఏర్పాటు చేస్తారు. రూ.75 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో గ్రామ/వార్డు సచివాలయానికి ఒకటి వంతున ఆక్వా ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలు (మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు) ఏర్పాటు చేస్తారు. తొలుత డిమాండ్ ఉన్న చోట వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి అక్కడి అమ్మకాలను బట్టి దశలవారీ విస్తరిస్తారు. హబ్‌లతో పాటు ఈ కేంద్రాలకు బ్రాండింగ్ చేయడంతో పాటు నాణ్యమైన తాజా చేపలు, రొయ్యలను ఒకేచోట నిర్దేశించిన ధరలకు విక్రయించేలా ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న జనతా బజార్ల ద్వారా మారుమూల పల్లె వాసులకు సైతం కోరుకున్న తాజా మత్స్య ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు.
ఒక్కో హబ్ పరిధిలో 200 మందికి ఉపాధి
హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఆక్వా రైతుల నుంచి సేకరించే మత్స్య ఉత్పత్తులను జిల్లాస్థాయిలో ఏర్పాటైన ఆక్వా ఫార్మర్స్ సొసైటీ ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే ఆక్వా హబ్‌లకు చేరవేస్తారు అక్కడినుంచి ప్రధాన నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసే స్పోక్స్‌కు, మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లకు తరలించి.. బతికిన, తాజా చేపలు, రొయ్యలు విక్రయిస్తారు. తద్వారా ప్రతి హబ్ పరిధిలో కనీసం 200 మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
చేయూత లబ్ధిదారులకు బ్యాంకు లింకేజ్
మినీ ఫిష్ వెండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు రూ.56,250 చొప్పున బ్యాంకు లింకేజ్ కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా.. నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,301 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,060 మంది చేయూత లబ్ధిదారులు ముందుకొచ్చారు. వీరితోపాటు ఇతరులెవరైనా ఆసక్తి చూపితే బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణపరపతి కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment