అమెరికా చదువులకు ఐదుగురు గురుకుల విద్యార్థులు | Five gurukula students for American studies | Sakshi
Sakshi News home page

అమెరికా చదువులకు ఐదుగురు గురుకుల విద్యార్థులు

Published Fri, Sep 1 2023 5:43 AM | Last Updated on Fri, Sep 1 2023 5:46 AM

Five gurukula students for American studies - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విద్యార్థులు, చిత్రంలో మంత్రి మేరుగు నాగార్జున తదితరులు

సాక్షి, అమరావతి: అమెరికా చదువులకు ఎంపికైన విద్యార్థులకు అవసరమైన సాయం అందించడమే కాకుండా వాళ్లు తిరిగి వచ్చాక కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  ‘కెన్నడీ లుగర్‌–యూత్‌ ఎక్స్ఛంజ్‌ అండ్‌ స్టడీ (కేఎల్‌–వైఈఎస్‌)’ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది దేశంలో 30 మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునే అవకాశం దక్కింది.వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లనున్న విద్యార్థులు.. డి.నవీన, ఎస్‌.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్‌.ఆకాంక్షలు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంను కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తి చేసుకుని వచ్చిన విద్యార్థులు.. కె.అక్ష, సి.తేజ కూడా  ఉన్నారు. విద్యార్థులను సీఎం జగన్‌ అభినందించి కుటుంబ నేపథ్యం, విద్యా సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ప్రకటించడంతోపాటు, వారికి శాంసంగ్‌ ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ముఖ్య కార్యదర్శి  జయలక్షి్మ, ఎస్సీ గురుకులాల సంస్థ కార్యదర్శి  పావనమూర్తి తదితరు­లున్నారు.  

కేఎల్‌–వైఈఎస్‌
‘కెన్నడీ లుగర్‌–యూత్‌ ఎక్స్ఛంజ్‌ అండ్‌ స్టడీ ప్రోగ్రామ్‌ను అమెరికాకు చెందిన సాంస్కృతిక వ్యవహారాల శాఖ సాంస్కృతిక మారి్పడి కోసం నిర్వహిస్తోంది. దీనికి ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలో నమోదు చేస్తారు. ఎంపికైన విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు ఆతిథ్యం ఇస్తాయి.

ఒక్కో విద్యార్థికి దాదాపు 200 డాలర్లు (సుమారు రూ.16,500) నెలవారీ స్టైఫండ్‌ను అందిస్తారు. ఈ ఏడాది ఎంపికైన ఐదుగురు విద్యార్థులు సెపె్టంబర్‌ మొదటివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్తారు. వీరికి అవసరమైన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్‌ ఫోన్‌ల కొనుగోలుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థిక సాయం అందిస్తోంది. కాగా, ఈ ఏడాది దేశం మొత్తం మీద 30 మంది  ఎంపికైతే మన ఒక్క రాష్ట్రం నుంచే ఐదుగురు గురుకుల విద్యార్థులు ఎంపిక కావడం విశేషమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు.

పేద కుటుంబం నుంచి అమెరికా
మాది విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ. అమ్మానాన్న.. సుకాంతి, ప్రవీణ్‌రాజ్‌. నాన్న చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. పేద కుటుంబానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే అది ప్రభుత్వ ప్రోత్సాహమే.    
– రోడా ఇవాంజిలి, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌  మధురవాడ అంబేడ్కర్‌ గురుకులం, విశాఖ

కలలో కూడా ఊహించలేదు..
మాది అనకాపల్లి జిల్లా  జి.కొత్తూరు. నాన్న కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. నేను అమెరికా చదువుకు ఎంపికవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయుల సహకారం వల్లే ఈ స్థాయికి వచ్చాను.    
– ఎస్‌.జ్ఞానేశ్వరరావు, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా

సీఎం సార్‌ ప్రోత్సాహమే..
మాది సత్యసాయి జిల్లా మల్లెనిపల్లి. నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌.  తల్లి నాగమణి గృహిణి. నేను అమెరికా చదువులకు ఎంపికయ్యానంటే దానికి సీఎం సార్‌  ప్రోత్సాహమే కారణం.  
– బలిగా హాసిని, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌  ఈడ్పుగల్లు ఐఐటీ–నీట్‌ అకాడమీ,ఎస్సీ గురుకులం, కృష్ణా జిల్లా

విద్యాలయాలను తీర్చిదిద్దారు..
మాది ప్రకాశం జిల్లా  పుచ్చకాయలపల్లి. నాన్న కేశయ్య  రైతు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి.  మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో బాగా తీర్చిదిద్దారు.   నాణ్యమైన విద్యను  అందిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు.
    – డి.నవీన, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని, మార్కాపురం గురుకులం, ప్రకాశం జిల్లా

ఎప్పటికీ మర్చిపోలేను..
మాది విజయవాడ. నాన్న సురేశ్‌.. అటెండర్‌. అమ్మ వనజ గృహిణి. ప్రభుత్వ గురుకులంలో చదివిన నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.   – ఆకాంక్ష, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్, ఈడ్పుగల్లు ఐఐటీ–ఎన్‌ఐటీ అకాడమీ, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement