
మళ్లీ మంచి రోజులు వస్తాయి
ఎవరూ అధైర్యపడొద్దు రాబోయే కాలం మనదే
ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది
మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది
పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప : ‘కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులొస్తాయి. ఎవరూ అధైర్యపడొద్ద’ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం రెండోరోజు పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.
కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, కలిసికట్టుగా అందరం ముందుకెళ్లాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతోపాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉంద’ని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

జాతీయస్థాయి పోటీలకు ఎదగాలి..
పులివెందుల వెంకటప్ప మెమోరియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్–18 గ్రూపు కింద రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సంతోషాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పంచుకునేందుకు పులివెందుల క్యాంపు కార్యాలయంలో వారంతా జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన ఆయన.. జాతీయస్థాయి పోటీలకు ఎదగాలని, అందుకు ప్రత్యేకంగా తరీ్ఫదు పొందాలని సూచించారు. కష్టపడితే సాధించలేనిది లేదన్న విషయాన్ని జీవితంలో గుర్తుపెట్టుకోవాలని ఉద్భోదించారు. దీంతో.. ‘మీ ఆకాంక్షను నెరవేరుస్తాం సార్’ అంటూ విద్యార్థులు ధీమాగా చెప్పారు.