2023లో దేశవ్యాప్తంగా 1,62,000 మంది చిన్నారులపై నేరాలు, 83,350 మంది పిల్లల మిస్సింగ్ కేసులు
లైంగిక వేధింపుల కేసులు 2021తో పోలిస్తే 2022లో పెరిగాయి
పోక్సో కేసుల్లో శిక్షలు వేస్తున్నా ఆగని ఘోరాలు
హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆవేదన
గుంటూరు వెస్ట్ : అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత కాలంలో కూడా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాప్‌లు, హత్యా నేరాలు పెరగడం అత్యంత దారుణమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో (జువెనైల్ జస్టిస్ కమిటీ) విభిన్న ప్రతిభావంతుల బాలల హక్కుల పరిరక్షణపై స్టేక్ హోల్డర్స్‌తో శనివారం గుంటూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన వార్షిక రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ.. రాకెట్ సైన్స్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవ ఆలోచనా విధానం ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. జాతీయ క్రైం బ్యూరో 2023 గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,62,000 మంది బాలలపై నేరాలు జరిగాయన్నారు. 83,350 మంది చిన్నారుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని.. బాలలపై కిడ్నాపింగ్, బలవంతపు నేరాలు 45 శాతం ఉన్నాయన్నారు.
ఇక దేశంలో లైంగిక వేధింపులకు గురైన వారి సంఖ్య 2021 కంటే 2022లో మరింత పెరిగాయన్నారు. పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) చట్టం ద్వారా కఠినమైన శిక్షలు వేస్తున్నా నేరాలు మాత్రం తగ్గడంలేదన్నారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డు ప్రకారం.. 1,004 కేసుల్లో 900 కేసులు తెలిసినవారి కారణంగా జరిగినవేనని చెబుతూ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ భావోద్వేగానికి లోనయ్యారు. బాలలు బలహీనులు, వారేమీ చేయలేరు, ఎవరికీ చెప్పుకోలేరని చాలామంది దాడులకు తెగబడుతున్నారని.. ఈ విధానం మారాలన్నారు.
సామాజిక బాధ్యతగా బాలల రక్షణ..
సమావేశంలో జువెనైల్ జస్టిస్ కమిటీ చైర్‌పర్సన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. నరేందర్ మాట్లాడుతూ.. బాలల రక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ చట్టం అనేది రక్షణ, సంరక్షణ అవసరమైన చిన్నారుల కోసం మాత్రమే కాదని.. తీవ్రమైన నేరారోపణలకు గురయ్యే పిల్లల సంరక్షణ కోసం కూడా ఉద్దేశించబడిందని వివరించారు. చట్టాలు అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనా ఎంతో ఉందని చెప్పారు. అనంతరం.. చిన్నారులుతో ముచ్చటించారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా న్యాయస్థానాల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment