తీర్పుల సంఖ్య కంటే.. తీర్పుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యం
కోర్టుల్లో పూర్తి సాంకేతిక పరిజ్ఞానం
అందుబాటులోకి కాగిత రహిత సేవలు
ప్రాంతీయ న్యాయసదస్సులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్
విశాఖ లీగల్: దిగువ న్యాయస్థానాల్లో కేసుల విచారణ బాధ్యతాయుతంగా ఉండాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. విశాఖ ఏయూ కాన్వొకేషన్ కేంద్రంలో శనివారం జాతీయ, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో దక్షిణ మండల–2 న్యాయమూర్తులకు ‘న్యాయస్థానాల్లో వ్యాజ్యాల జాబితా అన్వేషణ, మినహాయింపు’ అనే అంశంపై నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
కేసుల విచారణలో మానవత్వం, మానవ హక్కులు, మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ మార్గాలు పాటించాలని, ఈ విధానాల వల్ల కక్షిదారునికి అన్యాయం జరగకుండా తీర్పులొస్తాయన్నారు. ఎన్ని తీర్పులిచ్చాం అనే దానికంటే తీర్పుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమన్నారు. దిగువ కోర్టుల్లో విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే పూర్తి కంప్యూటర్ ఫైలింగ్, కృత్రిమ మేధస్సు సేవలు, కాగిత రహిత మార్పులు వంటివి అమల్లోకి వస్తాయన్నారు.
దేశవ్యాప్తంగా 38 లక్షల కేసుల నమోదు
జాతీయ జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్ జస్టిస్ అనిరుధ్ బోస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఏటా సగటున 38 లక్షల కేసులు నమోదవుతున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 4.5 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విషయంలో మధ్యంతర ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం మంచిదన్నారు. జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ పీఎస్ నరసింహ మాట్లాడుతూ.. అవసరం లేని సుదీర్ఘ వాదనలు, సంబంధం లేని సాక్ష్యాలు, కాలయాపన చేయడానికి జరుగుతున్న వివిధ
రకాల పిటిషన్లు న్యాయవ్యవస్థను ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు.
వీటినుంచి బయటపడి సాంకేతికతో కూడిన విధానాలను పాటించాలని సూచించారు. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.నరేంద్ర, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు మాట్లాడారు. సదస్సులో ఐదు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, గుత్తుల గోపి, ఎం.వెంకటరమణ తదితరులు న్యాయమూర్తులను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment