
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికమవుతున్నా ప్రణాళికాయుతంగా విద్యుత్ ఉత్పాదనను సాగిస్తూ, ప్రజలకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆయన సోమవారం సచివాలయంలో ఇంధనశాఖ, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లోను ఇదే తరహాలో విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.
33 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో సబ్‌స్టేషన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కమిటీలు తమ పరిధిలో విద్యుత్ డిమాండ్, లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరా తదితర అన్ని అంశాలను పరిశీలిస్తాయని, మెరుగైన విద్యుత్ సరఫరాకు సహకరిస్తాయని తెలిపారు. దరఖాస్తు చేసిన ప్రతి రైతుకు అర్హతే ప్రామాణికంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, తొమ్మిది గంటలపాటు పగటిపూట ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఉచిత విద్యుత్ దరఖాస్తులకు గడువు ఉండకూడదన్నారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను జూన్ 15వ తేదీలోగా పరిష్కరించి కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి వ్యవసాయానికి దాదాపు 1.20 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు డిస్కం అధికారులు తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుదీకరణను గడువులోగా పూర్తిచేయాలని మంత్రి కోరారు. పంపిణీ నష్టాలను పూర్తిస్థాయిలో నియంత్రణలోకి తీసుకురావాలని, పారిశ్రామికసంస్థల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
ఇప్పటికే పనులు అప్పగించిన సబ్‌స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. లో ఓల్టేజీ ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment