సాక్షి, అమరావతి: ప్రతి సీజన్‌లోనూ అకాల వర్షాల వల్ల సరైన దిగుబడి రాక.. చేతికి వచ్చిన కాస్త పంటను దాచుకునే పరిస్థితి లేక ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతనిస్తోంది. రైతులు అధిక దిగుబడులు సాధించేలా సాగులో మెళకువలు నేర్పిస్తోంది. ఉత్పత్తి నష్టాలు తగ్గించేలా నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పిస్తోంది. ‘ఒక జిల్లా–ఒక పంట’ పథకం కింద ఉల్లి పంట ఎక్కువగా సాగయ్యే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇతర జిల్లాల్లోనూ రైతులకు ఆర్థిక చేయూత నందిస్తోంది.
ఉత్పాదకత పెంచేలా..
రాష్ట్రంలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఒక్క కర్నూలు జిల్లాలోనే 71,397 ఎకరాల్లో పండిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది. మూడు నెలల్లో చేతికొచ్చే ఈ పంటకు ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుంటుంది. ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. అయితే వీటిని నిల్వ చేసేందుకు తగిన సదుపాయాలు లేకపోవడంతో పంట చేతికి రాగానే రైతులు అయినకాడికి అమ్ముకునేవారు. దీంతో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టాన్ని చవిచూసేవారు. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం.. నాణ్యమైన విత్తనాల నుంచి నిల్వ కేంద్రాల వరకు అన్నింటినీ సమకూరుస్తోంది. 10 నుంచి 12 శాతం ఉత్పాదకతను పెంచే నాణ్యమైన ఎల్–883, రెడ్–3, రెడ్–4 ఎఎఫ్‌ఎల్‌ఆర్ రకాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. 10 నుంచి 15 శాతం నాణ్యత పెంచేలా ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తోంది. డ్రిప్, మల్చింగ్‌తో రైజ్డ్ బెడ్ సేద్యం తదితర సాంకేతిక పద్ధతులపై శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో.. ప్రస్తుత రబీలో పెద్ద ఎత్తునే ఉల్లిసాగవుతోంది.
ఎకరాకు రూ.30 వేలు అదనపు లబ్ధి..
నాకు మూడున్నర ఎకరాలుంది. మరో 6 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ఉల్లి, వేరుశనగ, శనగలు సాగుచేసే వాడిని. ఏటా పంట చేతికొచ్చే సమయంలో కురిసే వర్షాల వల్ల ఉల్లి కొంత దెబ్బతినేది. పంట చేతికి వచ్చిన తర్వాత.. మంచి ధర వచ్చే వరకు ఉల్లిపాయలు దాచుకునే సదుపాయం లేక వెంటనే అమ్ముకోవాల్సి వచ్చేది. దీని వల్ల పెట్టుబడి దక్కడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో 25 టన్నుల ఉల్లిపాయలు దాచుకునేలా నిల్వ కేంద్రాన్ని నిర్మించుకున్నా. 50 శాతం సబ్సిడీతో పాటు ఎస్సీ కేటగిరిలో మరో 25 శాతం సబ్సిడీ కలిపి రూ.1.31 లక్షలు జమయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లిని దాచుకొని మంచి ధర వచ్చిన తర్వాత అమ్ముకోవడం వల్ల ఎకరాకు రూ.30 వేలు అదనపు లబ్ధి కలిగింది.
– హెచ్.ఏసన్న, కల్లపారి, కర్నూలు జిల్లా
50 శాతం సబ్సిడీతో యంత్రాలు..
రైతులకు రూ.8.03 లక్షల విలువైన ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, రూ.20 వేల విలువైన సీడ్ డిబ్లర్స్‌ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇస్తోంది. వీటివల్ల కూలీల ఖర్చు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సమగ్ర సస్యరక్షణ పథకం కింద హెక్టారుకు రూ.5 వేల ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఉల్లిని కనీసం 3, 4 నెలల పాటు నిల్వ చేసుకునేందుకు 25 టన్నుల సామర్థ్యంతో రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీయుటిలిటీ నిల్వ కేంద్రాలను నిర్మిస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే మొత్తం 600 నిల్వ కేంద్రాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కనీసం 100 కేంద్రాలకు ఆర్థిక సహకారం అందించనుంది. ఇతర జిల్లాల్లోనూ రైతులకు వీటిని మంజూరు చేస్తామని ప్రకటించింది. ఉల్లిని ఆరబెట్టడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఒక్కొక్కటి రూ.6.10 లక్షల విలువైన 15 సోలార్ పాలీడ్రయర్లను 75 శాతం(రూ.4.57 లక్షలు) సబ్సిడీపై సమకూరుస్తోంది. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ద్వారా ఉల్లిని ప్రాసెస్ చేసి.. ఉల్లి రేకులు, డీహైడ్రేటెడ్ పొడి, పేస్ట్, నూనె తయారు చేసి మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
50 టన్నుల నిల్వ కేంద్రాన్ని నిర్మించుకున్నా..
నేను ఎడెకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నా. ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీపై 50 టన్నుల సామర్థ్యం కలిగిన ఉల్లి నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పండిన ఉల్లిని నిల్వ చేసుకొని మంచి ధరకు అమ్ముకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతోంది.
– రామల్లకొట మధు, కర్నూలు
సోలార్ డ్రయ్యర్ ఇచ్చారు.
5 ఎకరాల్లో ఉల్లి పంట వేశాను. ఇప్పటికే మూడెకరాల్లో పంట తీస్తే 11 టన్నులొచ్చింది. మార్కెట్‌లో కూడా మంచి రేటు వస్తోంది. ప్రభుత్వం మా పొలంలో సోలార్ డ్రయ్యర్ పెట్టింది. ఉల్లి నిల్వ కేంద్రం, సోలార్ కోల్డ్ స్టోరేజ్ కోసం గ్రూప్‌గా ఏర్పడితే 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. వీటిని కూడా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.
– ఎం.మోదిన్‌సాహెబ్, పాలకుర్తి, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment