
గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ప్రసారాలు బాగున్నాయి
మేం తొమ్మిది నెలల్లో ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాం
ఉన్న కనెక్షన్లకు కూడా సరిగా ప్రసారాలు చేయలేకపోతున్నాం
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆగ్రహం
ముగ్గురు అధికారులను టెర్మినేట్ చేస్తున్నామని ప్రకటన
సాక్షి, అమరావతి: ‘తొమ్మిది నెలల్లో ఎటువంటి పురోగతి లేని సంస్థ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) మాత్రమే. మేం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. అంతేకాదు... ఉన్న కనెక్షన్లకు కూడా ప్రసారాలు నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు...’ అంటూ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన గురువారం విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ దినేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎండీ మరో ముగ్గురు అధికారులు భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్(బిజినెస్ హెడ్), శశాంక్ (ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్)లతో కలిసి ప్రభుత్వంపై కుట్రకు తెరతీశారని ఆరోపించారు. సంస్థను చంపే కుట్రకు తెరతీసి రాజద్రోహానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే భరద్వాజ, సురేష్, శశాంక్‌లను టెర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో 410మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తే వారిని ఇంతవరకు తొలగించకుండా జీతాలు చెల్లిస్తున్నారని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా జీఎస్టీ అధికారులు రూ.370 కోట్ల పెనాల్టీ విధించారని తెలిపారు. ఈ మొత్తాన్ని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చెల్లించదని, జీఎస్టీ పెనాల్టీకి కారణమైన ఎండీ దినేష్ కుమార్, ఈడీ(హెచ్‌ఆర్) రమేష్‌నాయుడు నుంచి రికవరీ చేయాలన్నారు. విజిలెన్స్ కమిటీ రూ.60 కోట్ల చెల్లింపులను నిలిపివేయాలని చెప్పినా.. వారు చెల్లించేశారని తెలిపారు. ఈ డబ్బులను కూడా వారి నుంచే రికవరీ చేస్తామన్నారు.
దినేష్‌కుమార్, రమేష్ నాయుడుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని, వారి ఆదేశాలకు అనుగుణంగా తాను నడుచుకుంటానని జీవీ రెడ్డి చెప్పారు. ఇప్పటి కంటే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ప్రసారాలు బాగున్నాయన్నారు. తాను అధికారులపై మాత్రమే ఆరోపణలు చేస్తున్నానని, దీనికి, వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల నిర్వాకం వల్లే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నష్టపోయారన్నారు. ‘మరో ఆరు నెలల్లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చనిపోతుంది. దీనికి కారణమైన మా ప్రభుత్వంలోని అధికారుల నిర్వాకం బహిర్గతం చేయకపోతే జీవీ రెడ్డి వల్లే సంస్థ మూత పడింది. కేబుల్ ప్రసారాలు ఆగిపోయాయి. తొలగించిన ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుని కొనసాగిస్తున్నారు.’ అని అనుకునే ప్రమాదం ఉందనే ఈ విషయాలను చెబుతున్నానని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment