
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సమస్యను పరిష్కరించడానికి, ఆచరణాత్మక మార్గాలను పరిశీలించడానికి.. దానిని సిఫార్సు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు లేఖ రాశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఈ లేఖ ప్రతులను మీడియాకు అందజేశారు. లేఖలో ప్రత్యేక హోదా అన్న పదాన్ని జీవీఎల్ ప్రస్తావించలేదు.
తెలంగాణతో పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై 17న జరిగే సబ్ కమిటీ సమావేశం అజెండా నుంచి హోదా సహా నాలుగు అంశాలను సవరించడాన్ని ఆయన అందులో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు వంటి నాలుగు అంశాలను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కారణాలు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆ లేఖలో జీవీఎల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర స్థాయిలో చర్చ జరిగితే తమకూ సంతోషమేనని తెలిపారు.
బాబు ప్రతిపాదనతోనే ప్యాకేజీ
హోదానైనా ఇవ్వండి లేదా అంతకు సరిపడా ప్యాకేజీ ఇవ్వండి అని అప్పట్లో చంద్రబాబు ప్రతిపాదన చేసేనే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందని జీవీఎల్ చెప్పారు.