ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణితో కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీ
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ పెంచేందుకు ప్రభుత్వ రంగ సంస్థ.. ఆప్కో, ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ కలిసి పనిచేయనున్నాయి. ఈ మేరకు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణిలతో కౌన్సిల్ కార్యదర్శి రంజన, కోశాధికారి జయశ్రీలు మంగళవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ.. భారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ అతిపెద్ద ఉపాధి రంగంగా ఉందన్నారు.
ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పని కల్పిస్తూ జీవనోపాధికి తోడ్పడుతోందన్నారు. అయితే తగిన ప్రచారం లేక ఇబ్బంది ఎదుర్కొంటోందని తెలిపారు. దీన్ని అధిగమించేందుకు ఆప్కో.. ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్‌తో కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకుందన్నారు. ఆప్కో ఎండీ నాగరాణి మాట్లాడుతూ.. చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యా సంస్థలతోపాటు ఇతర సంస్థల్లో అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ సహకరిస్తుందన్నారు. యువత ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నూతన డిజైన్లకు రూపకల్పన చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment