బి.కొత్తకోట : అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా రెండోదశ సాగు, తాగునీటి ప్రాజెక్టులో అంతర్భాగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే రామసముద్రం ఉపకాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులకు సర్వేకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఆ పనులు పూర్తయ్యాయి. ఈ రెండింటికి పాలనాపర అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. గుర్రంకొండ మండలంలో కొత్తగా రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కార్యరూపం దాల్చుతోంది. దీనికి సంబంధించి స్టేజ్–1 పనులు పూర్తయ్యాయి. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల 13న జరిగే రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలపనుంది.
గడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానుండగా, కుప్పం ఉపకాలువ మిగులు పనులు సత్వరమే పూర్తి చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కొత్త పథకాల రూపకల్పనతో ప్రాజెక్టు విస్తరణ పెరిగి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలగనుంది.
రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన రిజర్వాయర్
గుర్రంకొండ మండలం చెర్లోపల్లె వద్ద ప్రభుత్వం ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి తొలిదశ సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పూర్తయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు మళ్లించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది.
చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలించి ఎగువతోటపల్లె వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. 5 వేల ఎకరాలకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీ, రామానాయినిచెరువుకు 35 ఎంసీఎఫ్‌టీల నీటిని మళ్లించి నింపుతారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.359 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. స్టేజ్–1 స్థాయి పనులు పూర్తి కావడంతో పాలనాపరమైన అనుమతి కోసం నివేదికను చీఫ్ ఇంజినీర్, ప్రభుత్వానికి పంపారు.
రామసముద్రం ఉపకాలువ
మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలో మీటర్ నుంచి రామసముద్రం ఉపకాలువ మొదలవుతుంది. ఇక్కడికి 750 మీటర్ల దూరంలో ఒక ఎత్తిపోత ల పథకాన్ని నిర్మించి రామసముద్రం వరకు 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వుతారు. దీనికింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. రామసముద్రం సమీపంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మించి, ఇక్కడినుంచి తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని ప్రతిపాదన ఉంది. కాలువ సర్వే, సమగ్ర నివేదిక కోసం ప్రభు త్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ పొందిన సంస్థ సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించింది.
రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ
కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీ టిని అందించాలన్నది లక్ష్యం. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీ వా కాలువ ద్వారా మళ్లిస్తారు. దీని సమగ్ర సర్వే, ప్రా జెక్టు నివేదిక రూపొందించడం కోసం రూ.59.22 లక్షలతో సర్వే పనులు పూర్తవగా రూ.73.43 కోట్లతో ప నులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికింద 24 చెరువులకు నీటిని అందించి 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది లక్ష్యం.
త్వరలో గుడిసిబండ పనులు
ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందించే గుడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 1,400 ఎకరాలు చెరువులకింద, 2,600 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఈ పనులకు టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించనున్నారు. రూ.21.05 కోట్లతో పనులకు ఒప్పందం జరిగింది.
బాహూదాకు కృష్ణా జలాలు
నిమ్మనపల్లె మండలంలోని బాహూదా రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. అలాగే వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. దీని ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు.
పీబీసీపై 13న ఎస్‌ఎల్‌టీసీ భేటీ
పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై ఈ నెల 13న జలవనరులశాఖ రాష్ట్రస్థాయి సాంకేతిక క మిటీలో చర్చించి అమోదం తెలపనుంది. రూ.1,929 కోట్లతో ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు, సాంకేతిక అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె వద్ద కిలోమీటర్ 79 నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం తిమ్మిరెడ్డిపల్లె వద్ద 220.350 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ సాగుతుంది. ఈ కాలువ 140.75 కిలోమీటర్లు ఉండగా కుడివైపున కాలువను 4.8 మీటర్ల వెడల్పు చేయనున్నారు. కాలువ సామర్థ్యం ప్రకారం ఒక్కో పంపు 100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. కాలువలో 1,180 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించేలా నిర్మాణాలు చేపడతారు.
వేగంగా చర్యలు
హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పూర్తికి వేగంగా చర్యలు చేపట్టాం. రెడ్డెమ్మకోన రిజర్వాయర్, రామసముద్రం కాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి పాలనాపర ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాం. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై కమిటీ నిర్ణయం తర్వాత చర్యలు వేగవంతం అవుతాయి. కొత్త పథకాలకు రూపకల్పన చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాం.
– రాజగోపాల్‌రెడ్డి, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు
కుప్పంకు కొత్త కాంట్రాక్టర్
గత టీడీపీ హయాంలో కుప్పం ఉపకాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అందినంత దోచుకొని 2019 నుంచి పనులను నిలిపివేసింది. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా ఖాతరుచేయలేదు. మిగిలిపోయిన రూ.117.18 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థ నుంచి తొలగించారు. ఇదే విలువకు పనులు చేపట్టాలని పలు కాంట్రాక్ట్ సంస్థలను ప్రభుత్వం కోరగా హైదరాబాద్‌కు చెందిన నాలుగైదు నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఆ కంపెనీల సాంకేతిక అధికారులు ప్రస్తుతం కుప్పం కాలువలో మిగిలిన పనులను పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక మిగులుపని విలువతో పనులు చేసేందుకు ముందుకొస్తే టెండర్లు లేకుండా అప్పగించేందుకు నిర్ణయిస్తారు. లేనిపక్షంలో ప్రస్తుత నిర్మాణ ధరల ప్రకారం అంచనావేసి టెండర్లను ఆహ్వానించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment