AP: అలర్ట్‌.. అత్యవసరమైతేనే బయటకు రావాలి | Andhra Pradesh Heatwave Alert: Heavy Temperature In AP For Another Three Days, Details Inside - Sakshi
Sakshi News home page

AP: అలర్ట్‌.. అత్యవసరమైతేనే బయటకు రావాలి

Published Thu, Apr 18 2024 11:00 AM | Last Updated on Thu, Apr 18 2024 12:20 PM

Heavy Temperature In Ap For Another Three Days - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి ప్రతాపం ఉంటుందని, అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిణి సునంద వెల్లడించారు. కర్నూలు అనంతపురం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదు అవుతాయని, వడగాల్పుల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని ప్రజలకు వాతావరణం కేంద్రం సూచించింది.

రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంకంటే 3–6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్సార్‌ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

మూడురోజులు తేలికపాటి వర్షాలు
మరోవైపు గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడురోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నివేదికలో తెలిపింది.

అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా సంభవించవచ్చని పేర్కొంది. అందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు, శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement