Sai Teja: Helicopter Crash Deceased Jawan Funeral At Home Town - Sakshi
Sakshi News home page

సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు

Published Fri, Dec 10 2021 10:19 AM | Last Updated on Fri, Dec 10 2021 2:42 PM

Helicopter Crash Deceased Jawan Sai Teja Funeral At Home Town - Sakshi

నీరాక కోసం పురిటిగడ్డ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. భరత మాత ఒడిలో ఒదిగిపోయిన తన బిడ్డను చూడాలని ఆ తల్లి కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తోంది. నేనున్నా నాన్నా.. అంటూ ధైర్యం చెప్పిన కుమారుడి రాకకోసం ఆ తండ్రి కంటి రెప్పవాల్చకపోవడం అందరి హృదయాలను బరువెక్కిస్తోంది. తన పెనిమిటిని చూడాలని వీరనారి కన్నీటిపర్యంతమవుతున్న తీరుకు ఊరంతా శోకసంద్రమవుతోంది. అందరితో కలివిడిగా ఉంటూ.. దేశసేవకు ప్రాణాలర్పించిన వీరజవాన్‌ ఎక్కడొస్తున్నాడోనని ఆ ఊరి జనం పరితపిస్తున్న తీరు చలింపజేస్తోంది.

ఇప్పుడు కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరినోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. వీధులన్నీ వీరజవాన్‌ను తలుచుకుని కన్నీళ్లు పెడుతున్నాయి. దేశసేవకు అంకితమైన ఆ యువ ‘తేజ’ం ధైర్యసాహసాలకు ఉప్పొంగిపోతున్నాయి. జైజవాన్‌.. అమర్‌ రహే అంటూ కీర్తిస్తున్నాయి. 

సాక్షి, చిత్తూరు: కురబలకోట మండలం, ఎగువరేగడవారిపల్లెలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే సమాధానం అవుతున్నాయి. తమిళనాడు హెలికాప్టర్‌ ప్రమాదంలో సీఎస్‌డీ బిపిన్‌రావత్‌తో పాటు మరణించిన లాన్స్‌నాయక్‌ సాయి తేజ మృతదేహం కోసం జనం ఎదురు చూస్తున్నారు. భార్య శ్యామల, ఇద్దరు పిల్లలు గురువారం ఎగువరేగడవారిపల్లెకు చేరుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ అశోక్‌కుమార్, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ సయ్యద్‌ అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 
(చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్‌కు వెళ్లాడా’’)

అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారి నుంచి ఎగువరేగడకు వెళ్లే దారిని వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీతో జంగిల్‌క్లియరెన్స్‌ చేయించారు. లాన్స్‌నాయక్‌ సాయితేజకు సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సి ఉన్నందున అందుకు తగ్గట్టుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయితేజ పార్థివదేహాన్ని తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఖననం చేస్తామని చెప్పడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. 
(చదవండి: సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు)

అందరికీ ఆదర్శప్రాయుడు  
సాయితేజ 8వ తరగతిలోనే సైన్యం చేరాలని నిర్ణయించుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. గొర్రెల పెంపకం జీవనవృత్తి కలిగిన తమ కుటుంబాల్లో చదువు ప్రాముఖ్యతను వివరించేవాడని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో చేరితే దేశ సేవ చేయవచ్చంటూ గ్రామస్తులను ప్రోత్సహించేవాడని చెబుతున్నారు. అతని తమ్ముడు సైన్యంలో చేరేందుకు ప్రేరణగా నిలిచాడని, మరెందరో సైన్యంలో చేరడానికి కారకుడయ్యాడని కీర్తించారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా తమతోపాటుగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ సరదాగా గడిపేవారన్నారు. ఆర్మీలో చేరి దేశసేవ చేస్తే ఆ తృప్తే వేరంటూ చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. 

చదవండి: ప్రమోషన్‌ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement