బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్‌బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి.
నినాదాలు, ఆర్తనాదాల నడుమ..
సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్‌బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు.
జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్‌బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్‌డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు.
శ్యామలకు జాతీయ పతాకం అందజేత
సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment