High Court Cancels Panchayat Elections Schedule In AP | పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ - Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

Published Tue, Jan 12 2021 3:23 AM | Last Updated on Tue, Jan 12 2021 4:38 PM

High Court breaks for panchayat elections in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల కమిషన్‌ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్‌ అమలును నిలిపేసింది. ఎన్నికల కమిషన్‌ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్‌ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది.

ఈ బృహత్కార్యాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్‌ జరిపిన సంప్రదింపుల్లో నిష్పాక్షికత లేదని తేల్చి చెప్పింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. సంప్రదింపుల సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన స్వీయ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేసిందని ఆక్షేపించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్‌ జారీ చేసి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజు గంగారావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరించింది
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే ఎన్నికల షెడ్యూల్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌లు కూడా అత్యవసరంగా లంచ్‌ మోషన్ల రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై సోమవారం మధ్యాహ్నం న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, ఎన్నికల కమిషన్‌ తరఫున ఎన్‌.అశ్వనీకుమార్, కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌లు వాదనలు వినిపించారు. కరోనా మహమ్మారి తీవ్రతను, కరోనా వ్యాక్సినేషన్‌ బృహత్కార్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఏజీ శ్రీరామ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని, అయితే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు కాబట్టి, అలాగే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 

అప్పుడు.. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలే...
‘సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ లాంఛనప్రాయంగా మార్చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పలు మార్లు వివరించాం. అయినా మా వినతులను, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషనర్‌కు దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే, ఎన్నికల కమిషన్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు జోక్యంతో 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. కోవిడ్‌ ప్రారంభం దశలో ఉన్నప్పటికీ, దానిని సాకుగా చూపిన ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస స్థాయిలో కూడా సంప్రదించలేదు. ఏ దశలో ఎన్నికలు వాయిదా వేశామో, తిరిగి ఆ దశ నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెడతామని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా మళ్లీ ఏకపక్షంగా కేవలం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంగతిని గాలికొదిలేశారు..’ అని శ్రీరామ్‌ తెలిపారు.

ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు...
‘అప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నికలను వాయిదా వేశామని చెప్పిన ఎన్నికల కమిషనర్, ఇప్పుడు అదే ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారు.. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉందని, కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేస్తోందని చెప్పినా పట్టించుకోలేదు. వ్యాక్సినేషన్‌ సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం అయ్యే పరిస్థితి లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు ఇరుపక్షాలు కూర్చొని సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. అలా సంప్రదింపులు జరిపిన కొద్ది గంటల్లోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనర్‌ విడుదల చేశారు. దీనిని బట్టి ఎన్నికల కమిషనర్‌ ముందుస్తుగానే నిర్ణయం తీసుకున్నారని సులభంగా అర్థమవుతోంది..’ అని వివరించారు.

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది
‘కరోనా వ్యాక్సినేషన్‌ ఓ బృహత్కార్యం. రాష్ట్రంలో 1.49 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం కానుంది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఇన్ని వివరాలను సమర్పించినా కూడా ఎన్నికల కమిషన్‌ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసింది. కేరళ, తెలంగాణ, రాజస్తాన్‌ తదితర చోట్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే కోవిడ్‌ కేసులు భారీగా పెరిగాయి. ఇది దృష్టిలో పెట్టుకునే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశాం. వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా భయం లేకుండా నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయన్న విశ్వాసాన్ని ప్రజల్లో తీసుకురావాలి. అప్పటివరకు వేచి చూడాలి. ఎన్నికల కమిషనర్‌ తన సంకుచిత మనస్తత్వంతో ప్రజారోగ్యాన్ని, ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి.’ అని శ్రీరామ్‌ కోర్టును అభ్యర్థించారు. 

షెడ్యూల్‌ వచ్చాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు...
అనంతరం ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపించారు. ‘ఓసారి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరువాత సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది. అది ఇప్పటికీ అమలవుతూనే ఉంది. ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతోంది...’ అని అన్నారు. 

కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే...
అటు తరువాత కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపించారు. కేంద్రానికి కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో.. దేశంలోని 135 కోట్ల మందికి దశల వారీగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్‌ బయటకు వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే.’ అని వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎద్దుల మధ్య జరిగే పోరాటంలో లేగదూడలు బలి కాకూడదని, వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన షెడ్యూల్‌ అమలును నిలిపేస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే పరిస్థితి లేదు..
ఈ ఉత్తర్వులు జారీ చేసిన కొద్దిసేపటి తరువాత ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్లు లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. వ్యాక్సినేషన్‌ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే పరిస్థితి లేదని ఇరు ఫెడరేషన్లు స్పష్టం చేశాయి. కాగా ఈ వ్యాజ్యాల్లో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన ఉత్తర్వులే వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement