సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను శనివారం గట్టిగా నిలదీసింది. ఒక 2 నెలల తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటే ఎలా? అని ఆయనను ప్రశ్నించింది. కోర్టులు అధికార రహితమని భావిస్తున్నారా? అని నిలదీసింది. ఎన్నికల కమిషనర్ తనకున్న విచక్షణాధికారాలను ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వాటికి పరిమితులు లేవని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఆ విచక్షణాధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ప్రకటించారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదని గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మరోసారి న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ముందుకు విచారణకొచ్చింది.
నిమ్మగడ్డ కోర్టుకు బాధ్యత వహించాల్సిందే..
ముందుగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్ ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానం ప్రశ్నించజాలదని, పరీక్షించజాలదని తెలిపారు. పరీక్షించడమంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో అయితే పరిషత్ ఎన్నికలు నిలిచిపోయాయో అక్కడి నుంచే నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందన్నారు. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికలు పూర్తి కాగానే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారని వివరించారు. ఆయన కోర్టుకు బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. మరో 11 రోజులు మాత్రమే నిమ్మగడ్డ పదవిలో ఉంటారని, పరిషత్ ఎన్నికల పూర్తికి 6 రోజులు సరిపోతాయని, ఇప్పుడు ఆయన సెలవుపై వెళుతూ తనను ఏ రకంగానూ ప్రశ్నించకూడదనడం ఆయన తీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికలు నిర్వహించేలా కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు.
న్యాయ సమీక్షకు ఎన్నికల కమిషనర్ అతీతుడేమీ కాదు..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మరో రాజ్యాంగ వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ ఓ రాజకీయ పార్టీ కార్యాలయంలో తయారైందని, దీనిపై విచారణ కూడా జరుగుతోందన్నారు. కోర్టు ప్రశ్నించడం తన స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని ఆయన చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ న్యాయ సమీక్షకు అతీతుడు కారని తెలిపారు. అతీతుడిని అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అందరి వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment