
సాక్షి, అమరావతి: రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వాకం ఇప్పుడు ఇంకోసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలను తెచ్చిపెట్టింది. ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ జారీకి, పోలింగ్‌కు మధ్య నాలుగు వారాలపాటు ఎన్నికల కోడ్ అమలు చేయాలంటూ హైకోర్టు గురువారం జరగాల్సిన ఎన్నికలకు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ఆయన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా కొనసాగించి ఉంటే.. ఎటువంటి ఆటంకాలు వచ్చి ఉండేవి కావని అధికార వర్గాలు అంటున్నాయి.
పరిషత్ ఎన్నికల నిర్వహణను పట్టించుకోని నిమ్మగడ్డ
ఫిబ్రవరి 21కే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసింది. దీని తర్వాత కూడా నిమ్మగడ్డ దాదాపు 20 రోజులపైనే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను కొనసాగించారు. జనవరి 9 నుంచి మార్చి 11 వరకు 2 నెలలపాటు ఎన్నికల కోడ్‌ను అమలు చేశారు. ఆ సమయంలో కేవలం ఆరు రోజుల వ్యవధిలో ముగిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను ఆయన పట్టించుకోలేదు. హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ప్రకారం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే దాదాపు మరో నెల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. కోడ్ అమలు అంటే.. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అనేక ఆంక్షల మధ్య అమలు చేయాల్సి రావడమే. ఎన్నికల ప్రక్రియ ముగిశాక కూడా ఎన్నికల కోడ్ అమలు చేసిన నిమ్మగడ్డ ఉద్దేశపూర్వకంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఆపారనే విమర్శలు వెల్లువెత్తాయి.
సీఎస్ కోరినా పట్టించుకోకుండా..
గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా చేపట్టాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఫిబ్రవరి 15న నిమ్మగడ్డకు ప్రభుత్వం తరఫున ఒక లేఖను పంపారు. సీఎస్, ప్రభుత్వం సూచనలను పట్టించుకోకుండానే పంచాయతీ ఎన్నికలు ముగిశాక కూడా 20 రోజులకుపైనే నిమ్మగడ్డ కోడ్‌ను అమల్లో ఉంచారు.