సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టారని, ఇందుకు గాను అతనిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్‌కు రాసిన లేఖలు గవర్నర్ కార్యాలయం ద్వారానే లీక్ అయ్యాయని పరోక్షంగా చెబుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. అయితే, మార్చి 12న గవర్నర్‌కు రాసిన లేఖ కాపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి సైతం పంపారని, ఈ విషయాన్ని ఆయన తన పిటిషన్‌లో ప్రస్తావించకుండా దాచిపెట్టారని మోహన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎస్‌ఈసీ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో నిమ్మగడ్డ రమేశ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషనర్ పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అందువల్ల ఆయన రాజ్యాంగ వ్యవస్థగా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదు చేయజాలరని వివరించారు. వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేసి, గవర్నర్‌కు, ఎన్నికల కమిషనర్‌కు మధ్య రాసిన లేఖలు లీక్ అయ్యాయంటూ కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్‌తో తాను సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బహిర్గతం అయ్యాయని, దీనిపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోంశాఖను, సీబీఐని ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం మరోసారి విచారించారు.
రహస్య లేఖ ఎలా అవుతుంది..
మార్చి 12న నిమ్మగడ్డ మధురై, రామేశ్వరం వెళుతున్నట్టు గవర్నర్‌కు సమాచారం ఇచ్చారని, ఇది రహస్య లేఖ ఎలా అవుతుందని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఈ లేఖలోని కొంత భాగాన్ని మాత్రమే హైకోర్టు ముందుంచి మోసపూరితంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. ఆ లేఖను పూర్తిగా పరిశీలిస్తే ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి పంపిన విషయం అర్థమవుతోందని కోర్టుకు నివేదించారు. వారి కార్యాలయాల్లో కూడా లీక్ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేఖల లీక్‌పై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని, సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏం తేలుస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలో నిర్దేశించిన నేరాల విషయంలో మాత్రమే సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. నిమ్మగడ్డ తన పిటిషన్‌లో ఎక్కడా నేరం జరిగినట్టు చెప్పలేదని, అలాంటప్పుడు సీబీఐ ఎలా దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. సీబీఐ తన పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. అధికరణ 226 కింద పిటిషనర్ కోరిన అభ్యర్థనను న్యాయస్థానం మన్నించడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
సోషల్ మీడియాలో పోస్టులపై సీబీఐ నివేదిక
తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా
పలు కేసుల్లో హైకోర్టు తీర్పుల సందర్భంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వెలువడిన పోస్టులపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు.. రోడ్డుపై తాగి న్యూసెన్స్ సృష్టించిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అదుపు చేయడంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై పోస్టులు వెలువడిన విషయం విదితమే.
వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 12న ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టు ముందుంచింది. ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలు ఉండటంతో వాటినుంచి సమాచారం తెప్పించుకునేందుకు సమయం పడుతుందని, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. దర్యాప్తును పూర్తి చేసేందుకు సమయం పడుతుందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment