డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం
17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనవాహిని
జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు.. జనసంద్రమైన రావులపాలెం.. రాజమహేంద్రి.. రోడ్డుకు ఇరువైపులా మానవహారాలు
కడియపులంకలో సీఎం వైఎస్ జగన్‌పై పూల వర్షం
వేమగిరిలో ఎడ్లబండ్లపై తరలి వచ్చిన రైతన్నలు
బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత.. విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఉత్సాహం
బొమ్మూరులో 108 గుమ్మడి కాయలతో దిష్టి తీసిన మహిళలు
అందరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించి అభయమిచ్చిన జననేత
వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణలశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు
అడుగడుగునా అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం
నుదుట గాయం బాధిస్తున్నా చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం
‘ఇన్నాళ్లూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించా. పక్షవాతం వచ్చి కాలుచేయి పడిపోయాయి. వయసు మళ్లడంతో కష్టపడే ఓపిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌బాబు ఇంటికే నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా వైద్యం చేయించారు. దేవుడు లాంటి ఆ బాబును చూడ్డానికి పొద్దునే వచ్చా’..
– తేతలి హైవేపై ముఖ్యమంత్రి రాక కోసం నిరీక్షిస్తున్న 75 ఏళ్ల విష్ణుమూర్తి అంతరంగం.
‘నాకు ఇద్దరు కొడుకులు. కూలి చేసుకునే బతుకులు మావి. పిల్లలను చదివించుకోలేకపోయా. ఇప్పుడు నా మనవళ్లను జగన్ గారు ఉచితంగా చదివిస్తున్నారు. అలాంటి గొప్ప మనిషిని చూడడం మా అదృష్టం’..
– తణుకు ప్రాంతానికి చెందిన పంపన ఇందిర సంతోషం ఇదీ.
‘మా ఇద్దరు తోటికోడళ్లకు జగన్ గారు ఇంటి స్థలం ఇచ్చారు. మా బాబుకు అమ్మఒడి ఇస్తున్నారు. మా సొంత ఇంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మా ఊరు వచ్చారు.. ఎంతసేపైనా సరే ఇక్కడే ఉండి ఆయనకు స్వాగతం పలుకుతాం’..
– ఇందిర కోడలు అపర్ణ ఆనందం ఇదీ.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మండుటెండల్లోనూ గోదారమ్మ పోటెత్తింది! ఉభయ గోదావరులూ ఉప్పొంగాయి! కోనసీమ కోలాహలమైంది! గోదావరి తీరం జన సంద్రమైంది! రావులపాలెం నుంచి రాజమహేంద్రి దాకా ఎటుచూసినా జన ప్రవాహమే! తమకు మంచి చేసిన జననేతను స్వయంగా చూసేందుకు పెద్దల నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ ఎండను లెక్క చేయకుండా వెల్లువలా తరలి వచ్చారు. అభిమాన నేతను దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ఉత్సాహం చూపారు. ఊర్లన్నీ జాతీయ రహదారి బాటపట్టాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా 17వ రోజైన గురువారం కనిపించిన దృశ్యాలివి. తేతలి నుంచి తణుకు వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిలబడి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలను నెలకొల్పి తమ కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులు థాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక రాజమహేంద్రవరం చరిత్రలో ఇంతవరకూ ఏ రాజకీయ నేత నిర్వహించిన యాత్రలో ఇంత జనసందోహాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
తేతలి రాత్రి బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన సందోహం తరలిరాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకుంది. తేతలి నుంచి యాత్ర ప్రారంభం కాగానే దారి పొడవునా అక్క చెల్లెమ్మలు, వృద్ధులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అంతకుముందు తేతలి బస వద్ద సీఎంను తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు నేతలు కలిశారు. దారిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎదురు చూస్తున్న దివ్యాంగులు, స్థానికులను సీఎం పరామర్శించి వినతి పత్రాలు స్వీకరించారు. యాత్ర అక్కడకు రెండు కి.మీ. దూరంలోని తణుకు చేరుకునే సరికి 40 నిమిషాల సమయం పట్టింది.
బైక్ ర్యాలీతో కోనసీమ స్వాగతం..
జాతీయ రహదారి వెంట సాగిన సీఎం జగన్ యాత్రలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మహిళలు కనిపించారు. సిద్ధాంతం సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. ఈతకోటలో యువకులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీగా వచ్చి తమ ప్రియతమ నేతను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి ఆహ్వానించారు. అమ్మ ఒడితో ఆదుకున్న జగన్ మామయ్యను చూసేందుకు స్కూల్ పిల్లలు తరలివచ్చారు. ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా లిడియా ఫార్మశీ కాలేజీ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్ వద్ద గోదావరి సాక్షిగా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళలు మేమంతా సిద్ధం అంటూ స్వాగతం పలికారు. రావులపాలెం సెంటర్ జన సందోహంతో కిక్కిరిసిపోయింది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ కోసం గంటల తరబడి ఎదురు చూశారు.
ఎడ్లబండ్లపై వచ్చిన రైతన్నలు..
మధ్యాహ్నం పొట్టిలంక వద్ద స్వల్ప విరామం అనంతరం సీఎం జగన్ యాత్రను తిరిగి ప్రారంభించారు. వేమగిరి సెంటర్‌లో రైతులు ఎడ్లబండ్లపై వచ్చి స్వాగతం పలికారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆర్బీకేలతో మాకు ఎంతో మేలు చేసిన సీఎం జగన్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్క చెల్లెమ్మలు 108 గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. రావులపాలెం నుంచి బొమ్మూరు, రాజమండ్రిలోని పలు కూడళ్లు మధ్యాహ్నం నుంచే జనంతో కిక్కిరిసిపోయాయి. బొమ్మూరు నుంచి మొదలు దేవీచౌక్ వరకు ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. జగన్ పాలనకు మద్దతుగా రాజీనామా చేసిన వలంటీర్లు మేమంతా నీవెంటేనంటూ వేమగిరిలో ప్లకార్డులు ప్రదర్శించారు.
రాజమహేంద్రి జనసంద్రం...
సాయంత్రం 4.30 గంటలకు బొమ్మూరు జంక్షన్ చేరుకున్న సీఎం జగన్ యాత్ర 5.45కి మోరంపూడికి చేరుకుంది. రోడ్డు మొత్తం జనంతో నిండిపోవడంతో 3 కి.మీ ప్రయాణానికి దాదాపు 1.15 గంటల సమయం పట్టింది. అనంతరం యాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్, జాంపేట, దేవిచౌక్, గోకవరం బస్టాండ్, సీతంపేట, పేపర్‌మిల్లు, మల్లయ్యపేట, దివాన్‌చెరువు మీదుగా రాజానగరం చేరుకుంది. మోరంపూడి సెంటర్ నుంచి 16 కి.మీ కొనసాగిన యాత్ర రాత్రి 9 గంటలకు దివాన్‌చెరువు చేరుకుంది. మధ్యలో ప్రతి సెంటర్ జనంతో నిండిపోయింది. రాజమండ్రి వాసులే కాకుండా చుట్టుపక్కల 10 కి.మీ పరిసరాల్లో ప్రజలు జగన్ కోసం ఎదురు చూశారు.
మండుటెండలోనూ..
58 నెలల పాలనలో తామంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే అవకాశం కల్పించారని, పిల్లలకు అత్యుత్తమ విద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన సీఎం జగన్‌ను స్వయంగా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 43 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తణుకు బైపాస్ నుంచి పెరవలి, ఖండవల్లి, సిద్ధాంతం, ఈతకోట, రావులపాలెం, జొన్నాడ, చెముడులంక, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి వరకు యువత, వృద్ధులు, విద్యార్థులు, పిల్లలతో కలసి మహిళలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు.
కడియపులంక వద్ద జగన్‌పై పూల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో యువ లాయర్లు సీఎం జగన్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం జగన్ యాత్ర సాయంత్రం 4.30 గంటలకు బొమ్మూరు చేరుకుంది. రాత్రి 9.15 గంటలకు ఎస్‌టీ రాజాపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. తేతలి నుంచి ఎస్‌టీ రాజపురం వరకు మొత్తం 88 కి.మీ. మేర గురువారం బస్సు యాత్ర కొనసాగింది.
అనారోగ్య బాధితుడికి భరోసా
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో బస్టాండు వద్ద అంబులెన్స్‌ను గమనించిన సీఎం జగన్ తన బస్సును ఆపాలని ఆదేశించారు. కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. చిలకలపాడుకు చెందిన రాయుడు సత్తిబాబు రెండేళ్ల నుంచి నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు సీఎంకు విన్నవించారు.
వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీంతో సీఎం జగన్ చలించిపోయి సత్తిబాబుకు ఆరోగ్యం చేకూరేందుకు ఎంత వ్యయమైనా భరించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. వెంటనే బాధితుడి వివరాలు తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బందికి సూచించారు. తక్షణమే స్పందించడం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ, జనసేన నేతల చేరిక
తేతలిలో రాత్రి బస కేంద్రం వద్ద తనను కలసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణరాజును సీఎం జగన్ ఆత్మీయంగా పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన కీలక నేతలు ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువాలు వేసి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.
రాజోలు జనసేన కీలక నేత బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ (ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, కేశనపల్లి మాజీ సర్పంచ్ డి.సూర్యనారాయణ, జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్, తాడేపల్లిగూడేనికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ కన్వీనర్ గమ్మిని సుబ్బారావు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్.గణపతిరావు కుమారుడు గణేష్ బాబు, మనవడు గణపతిరావు, టీడీపీ నుంచి వడ్లమూడి గంగరాజు పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment