తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేకపాటి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రులు బొత్స, వెలంపల్లి, కన్నబాబు తదితరులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్రానికి, వైఎస్సార్‌సీపీకి తీరని లోటని రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాపసభ నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిమి షాలు మౌనం పాటించారు.
అనంతరం మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మృతిచెందారనే వార్త విని షాక్‌కు గురయ్యానన్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి మరణించారన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి మేలుచేయాలని అనునిత్యం కష్టపడ్డారని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వైఎస్సార్‌సీపీ విజయవాడ సిటీ అధ్యక్షుడు భవకు మార్, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
సంతాప సభగా మారిన బీసీ చైర్మన్ల సదస్సు
విజయవాడ సమీపంలోని గొల్లపూడి బీసీ భవన్‌లో సోమవారం నిర్వహించిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల సదస్సు ఉహించని పరిణామంతో సంతాప సభగా మారిపోయింది. సదస్సుకు హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు మంత్రి గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. కాగా విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో సోమవారం మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభ నిర్వహించారు. చేనేత, జౌళి శాఖ, ఆప్కో అధికారులు, సిబ్బంది మంత్రి గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment