స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు.. కరుణాకర్‌ను కత్తితో దారుణంగా చంపి శివునిపల్లి శివారు నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీగల యోబు, మరియ దంపతుల రెండో కుమారుడు కరుణాకర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా శివునిపల్లికి చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తుంటాడు. నమిలిగొండ శివారులో వారివురి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో కరుణాకర్‌కు, నాగరాజు భార్యకు మధ్య పరిచయం ఏర్పడింది.
ఈనెల 25న హైదరాబాద్‌లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్య ఫోన్‌కు ఫోన్ చేయగా ఇంట్లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇదీ గమనించని కరుణాకర్ తాను సాయంత్రం వస్తున్నానని, కలుస్తామని చెప్పగా నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ విషయంపై ఏమి తెలియనట్లు బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఆమెకు మరోసారి ఫోన్ రావడంతో తమ వ్యవసాయ భూముల సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు వెళ్లింది. గమనించిన నాగరాజు కత్తి తీసుకుని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కరుణాకర్ మాట్లాడుతున్న విషయం గుర్తించి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హతమార్చాడు.
అనంతరం మృతదేహాన్ని కచ్చువల, సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేసి వెళ్లాడు. ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి కరుణాకర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. అతడి ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో నిందితుడు స్వయంగా మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్‌రెడ్డి.. చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు.
దీంతో మృతుడి భార్య, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. కాగా, హత్య ఒక్కరే చేశారా.. మరెవరైనా ఉన్నారా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే పోలీసులు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment