
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమించి, శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని టీటీడీ బోర్డు సభ్యుడు, సినీ నిర్మాత దాసరి కిరణ్ అన్నారు. దాసరి కిరణ్ కుమార్ టీటీడీ బోర్డు మెంబర్ అయిన సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన తెనాలిలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘టీటీడీ బోర్డు మెంబర్ అనేది ఒక పదవి కాదు.. శ్రీవారికి చేసే సేవ. ఇంత గొప్ప అవకాశం సీఎం జగన్ రూపంలో ఆ దేవుడు నాకు ఇచ్చినట్లు భావిస్తున్నాను’ అన్నారు. ‘కిరణ్‌లాంటి మంచి మనిషికి దేవుని సేవ చేసుకునే అదృష్టం కలగడం చాలా ఆనందంగా ఉంది’అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘నేను చిరంజీవి అభిమానిగా ఉన్నప్పట్నుంచి దాసరి కిరణ్ అన్న నాకు పరిచయం. కిరణ్ అన్న చేసిన కార్యక్రమాలు నాకు తెలుసు. ఎంతో మందికి సాయం చేశారు. ఆ మంచితనమే కిరణన్నని ఈ రోజు ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టింది’ అని దర్శకుడు బాబీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment