శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మోహన్‌బాబు అరసవల్లి క్షేత్రానికి వెళ్లాలని సూచించారని, అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు.
ఇక తాము ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ప్రకటించారు.
స్మార్ట్ క్లాస్‌రూమ్ ప్రారంభం
పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3 లక్షలతో డిజిటల్ తరగతిని (స్మార్ట్ క్లాస్‌రూం)ను సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమెతో పాటు జిల్లా డీఈఓ జి.పగడాలమ్మ, ఎంఈఓలు సీహెచ్ మణికుమార్, కె.రాంబాబు, ప్రధానోపాధ్యాయు డు సింహాచలం, సర్పంచ్ జక్కర ఉమా, ఎంపీటీసీ మడ్డు సుగుణ కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే హిరమండలం మండలంలోని సవరచొర్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూంను కూడా ఆమె ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment