కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’ | Institutions of higher education will soon have a place for local artists | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో ఇక ‘కళా గురువులు’

Published Thu, Mar 23 2023 3:53 AM | Last Updated on Thu, Mar 23 2023 8:57 AM

Institutions of higher education will soon have a place for local artists - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న యాంత్రిక పద్ధతిని నివారించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నడుం బిగించింది. ప్రస్తుత విద్య ఒత్తిడితో కూడుకుని యాంత్రికంగా మారుతుండటంతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి సన్నగిల్లుతోంది. దీన్ని మార్చి విద్యార్థులు ఇష్టంతో విద్య నేర్చుకునేలా యూజీసీ చర్యలు చేపట్టింది. చదువులను ఆహ్లాదకరంగా మార్చడానికి వివిధ కళారూపాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవా­లని నిర్ణయించింది.

ఇందులో భాగంగా వివిధ కళల్లో లబ్ధప్రతిష్ట లైన వారిని కళాశాలల్లో కళా గురువులుగా నియమించనుంది. వీరి ద్వారా హస్తకళలు, సంగీతం, నృత్యం, జానపదాలు, థియేటర్, తోలు»ొమ్మ ప్రదర్శనలు, ఫొటోగ్రఫీ, కాలిగ్రఫీ, యోగా, పెయింటింగ్, ఇంద్రజాలం (మ్యాజిక్‌) వంటి వాటిని సహ పాఠ్య కార్యక్రమాలుగా ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు యూజీసీ తాజాగా ముసాయిదా ప్రతిపాదనలు విడుదల చేసింది.

సృజనాత్మకతను పెంపొందించే ఈ సంప్రదాయ కళారూపాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు దోహదపడతాయని యూజీసీ భావిస్తోంది. దీనివల్ల విద్యార్థుల్లో కళాత్మక ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం ఉంటుందని, చదువుల్లోనూ వారు మరింత ఉత్సా­­హంగా ఉంటారని అభిప్రాయపడుతోంది. అదే సమయంలో మరుగునపడిపోతున్న కళారూపాలకు మళ్లీ కొత్త జీవం పోసినట్లు అవుతుందని తలపోస్తోంది.  

ఏకకాలంలో రెండు ప్రయోజనాలు.. 
మన దేశం గొప్ప కళా, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి అనేక అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. వీటిని కళాకారులు సంరక్షించుకుంటూ వస్తు­న్నా­రు. అయితే వీటికి విద్యా వ్యవస్థతో సంబంధం లేకుండా పోవ­డంతో కొత్త తరానికి ఈ కళల గురించి అవగాహన లేదు.

ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు, కళలకు మధ్య చాలా అంతరం ఏర్పడింది. దీన్ని తగ్గించడానికి ఈ కళాగురువుల విధానానికి యూజీసీ శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఈ కళా రూపాలను సంరక్షించుకునే వీలు కలుగుతుంది. అదే సమయంలో ఒత్తిడితో యాంత్రికంగా మారిపోయిన విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటపడటానికి.. ఆహ్లాదకరంగా విద్య నేర్చుకోవడానికి అవకా­శం ఉంటుంది.

ఈ నేపథ్యంలో కళాశాలల్లో విద్య, బోధన, పరిశోధన ఇతర విద్యా కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగిన కళా గురువులను రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించనున్నా­రు. ఉన్నత విద్యా విధానంతో హస్త కళలు, నృత్య రూపకాలు, సంగీతం, లలిత కళలు మొదలైనవాటిని అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మెరుగుపరచనున్నారు. 

మూడు విభాగాల్లో కళా గురువులు..  
ఆయా కళల్లో స్థానిక కళాకారులను గుర్తించి ఎంప్యానెల్‌ చేయడానికి ఆయా విద్యాసంస్థలు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీ.. కాంపిటెంట్‌ అథారిటీకి సిఫార్సులను అందించాలి. కళా గురువులను మూడు విభాగాల్లో ఎంపిక చేయనున్నారు. పరమేష్టి గురువు, పరమ గురువు, గురువు అనే విభాగాల్లో వీరిని నియమించనున్నారు.

పరమేష్టి గురువుగా నియమితులు కావాలంటే పద్మ అవార్డు లేదా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు పొంది ఉండాలి. కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. పరమ గురువుకు కనీసం ఒక జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన అవార్డు, లేదా తత్సమాన అవార్డు తప్పనిసరి. అనుభవం 10 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.

ఇక గురువుకు.. పరమేష్టి, పరమ గురువుల కేటగిరీల్లో లేని మాస్టర్లుగా పేరు తెచ్చు­కున్న కళాకారులను ఎంపిక చేయొచ్చు. అనుభవం 5 ఏళ్లకన్నా తక్కువ ఉండరాదు. అయితే అంతర్జాతీయ, జాతీయ, ప్రభుత్వ గుర్తింపు పొందిన కచేరీల్లో పాల్గొని ఉండాలి. ఎంప్యానెల్‌ అయిన కళా గురువులకు కార్యకలాపాలను నిర్వహించడానికి తగిన వేది­కను ఏర్పాటు చేస్తారు. అవసరమైన ఇతర సహాయంతో పాటు సౌకర్యాలు అందిస్తారు. ప్రయాణ ఖర్చులు, వసతి, నిబంధనల ప్రకా­రం గౌరవ వేతనం ఇస్తారు.

కళారూపాల జాబితా ఇలా.. 
హస్త కళలు: కుండలు, వెదురు ఆకృతులు, చెక్క పని, టెర్రాకోట, మధుబని, పిచ్వాహి, చరఖా నేయడం, మొఘల్‌ ఉడ్‌ ఆర్ట్, స్టోన్, కాంస్యం పని, మీనాకారి పని, నేత, అద్దకం, బ్లాక్‌ ప్రింటింగ్, మినియేచర్‌ పెయింటింగ్, ఉడ్‌ కారి్వంగ్, ప్రింటెడ్‌ టెక్స్‌టైల్స్, నేచురల్‌–ఆర్గానిక్‌ డైస్‌ ప్రిపరేషన్, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ, కార్పెట్‌ నేత, కాలిగ్రఫీ, దడ్తాన్‌ గోయ్‌ తదితరాలు. 

శాస్త్రీయ సంగీతం: హిందుస్థానీ గాత్రం, హిందుస్థానీ వాద్యం, కర్ణాటక గాత్రం, కర్నాటిక్‌ ఇన్సŠట్రుమెంటల్, గుర్బానీ, సుఫియానా సెమీ క్లాసికల్, లైట్, మోడ్రన్‌ మ్యూజిక్, తుమరి/ దాద్రా/కజ్రీ, గజల్, గీత్, భజన్, సూఫీ తదితరాలు. 

సోపాన సంగీతం: ఖవాలీ, భక్తి– భజన, రామాయణం, శ్రీమద్భాగవత్‌ పఠనం తదితరాలు, రవీంద్ర సంగీతం, ఫ్యూజన్‌/జుగల్‌బందీ/తల్వాధ్య, ఆర్కె్రస్టా/కోరల్, రాక్, బ్యాండ్‌/జాజ్, కోయిర్‌ గానం తదితరాలు. 

డ్యాన్స్‌: సంప్రదాయ నృత్య రూపకాలైన కథక్,  ఒడిస్సీ, భర­తనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, మోహినీయా­­ట్టం, ఛౌ, సత్త్రియ, యక్షగానం, పాండ్వానీ తదిత­రా­లు. 

జానపద నృత్యం: భాంగ్రా/గిద్దా, గర్బా, రౌఫ్, ఘూమర్, బిహు, లావణి, విలాసిని నాట్యం, ధిమ్సా, బగురుంబా, అలీ ఐ లిగాంగ్, కోలాటం, నాట్యం, అజిలా­ము, రొప్పి, ఫోనింగ్, కజారి, ఝుమారి, దండారి, గెం­డి, పంతి, కర్మ, దమ్‌కాచ్, మాండో, తల్గారి, సువారి, దసరవదన్, కుంబీ, ఫుగాడి, రాస్, భావాయి, తిప్పానీ, గుగ్గ, ఖోరియా, కులు నాటి, నామ్‌గెన్, హికత్, ఛమ్, దుమ్హాల్, కుడ్, భంద్‌ జషన్, ఫాగువా, కృష్ణ పారిజాత, నాగమండల, భూత ఆరాధన, కైకొట్టికలి, తుంబి తు­ల్లాల్, కర్మ, గౌర్‌ మారియా, కక్సర్, అహిరి, పావ్రీ, ధంగారి గజ, ఖంబ థోయిబి, పుంగ్‌ చోలోమ్, నోంగ్‌క్రెమ్, చెరావ్, ఖుల్లం, చంగ్లో–సువాలువా, ఘుమురా, రుక్‌ మార్, గోటిపువా, ఝుమర్, కుచి్చఘోడి, కల్బేలియా, భావాయి, సపేరా నృత్యం, సింఘీ చామ్, ఖుకూరి, తలచి, కరగాట్టం, మయిల్‌అట్టం, కుమ్మి, కావడి, గరియా, హోజాగిరి, రాస్లీల, చర్కుల, బరదానాటి, చాపెలి, లాంగ్వీర్, గంభీర, కలి­కాపటడి, డోమ్ని, కలరిపట్టు, ఒట్టంతుల్లాలెట్‌ తదితరాలు. 

వృత్తిపరమైన కళారూపాలు: పెయింటింగ్, ప్రింట్‌ మేకింగ్, టెక్స్‌టైల్, డ్రాయింగ్, స్కల్ప్చర్, సిరామిక్, కాలిగ్రఫీ, ఫొ­టో­గ్రఫీ, జానపద థియేటర్, నౌతంకి, యోగా, ఇసుక కళ, మెహందీ, ఫ్లోర్‌ ఆర్ట్‌ (రంగోలి/మందన/కోల­మె­ట్సీ), కథకులు, మ్యాజిక్‌ షో, పప్పెట్‌ షో, కామిక్‌ ఆర్ట్‌ తదితరాలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement