మార్పును పట్టుకుందాం | jagananna vidya deevena cm ys jagan released rs 694 crore | Sakshi
Sakshi News home page

మార్పును పట్టుకుందాం.. విద్యా దీవెన నిధులు విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Published Fri, Aug 12 2022 3:33 AM | Last Updated on Fri, Aug 12 2022 3:31 PM

jagananna vidya deevena cm ys jagan released rs 694 crore - Sakshi

ఇవాళ 17–22 ఏళ్ల పిల్లలు రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రపంచంలో కనీసం మరో 80 సంవత్సరాలు సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో జీవించాలి. పదేళ్ల క్రితం మన దేశం, మన కుటుంబం, మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశామో చెప్పగలం. అయితే 20 ఏళ్ల తర్వాత ఎలాగుంటుందో చెప్పలేనంత వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అంతే వేగంతో ప్రయాణం చేయకపోతే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరు. అలా పోటీ పడాలంటే ప్రతి అడుగులోనూ మార్పు కనిపించాలి. అందుకు ప్రభుత్వ పరంగా తగిన వాతావరణం ఏర్పాటు చేయాలి. ఈ మూడేళ్లుగా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో విద్యార్థుల తల రాతలు మార్చడం కోసమే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఏ బిడ్డకైనా అతిగొప్ప దీవెన ఏదైనా ఉంటుందంటే అది చదువేనని, ఇది ఏ ఒక్కరూ కొల్లగొట్టలేని ఒక ఆస్తి అని చెప్పారు. పేదరికం నుంచి బయట పడటం చదువు వల్లే సాధ్యమవుతుందన్నారు. గురువారం ఆయన బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 2022 ఏప్రిల్‌ – జూన్‌న్‌త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలిగిస్తూ కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రూ.694 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు రూ.35 వేలు.. రూ.50 వేలు.. రూ.70 వేలు.. రూ.లక్ష.. అంతకన్నా ఎక్కువైనా సరే 100% ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి  తల్లుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నామన్నారు. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, ఇతర కులాల్లోని పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలనేది మనందరి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో వచ్చినప్పుడే పేదరికం పోతుందన్నారు. ఇందులో భాగంగానే కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా.. పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇలాంటి పథకం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేదని, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతోందని స్పష్టం చేశారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందినీ చదివిస్తామని పునరుద్ఘాటించారు. చదువుకునే పిల్లలందరికీ అన్నగా.. అక్కచెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా.. మీ ఇంటి మనిషిగా ఈ మాట చెబుతున్నానని అన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

చిరునవ్వుతో బకాయిలు చెల్లించాం 
► గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు 2017–18, 2018–19కి సంబంధించి రూ.1,778 కోట్లు మన ప్రభుత్వం పిల్లల కోసం చిరునవ్వుతో చెల్లించింది. ఇందులో భాగంగా ఈ కాలేజీకి (ప్రస్తుతం సభ జరుగుతున్న) కూడా రూ.14 కోట్లు బకాయిలు చెల్లించాం. 
► పిల్లల గురించి, వారి చదువుల గురించి అంతలా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఇది. ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు సంబంధించి మాత్రమే ఈ మూడేళ్లలో రూ.11,715 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. 
► జగనన్న వసతి దీవెన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి రెండు దఫాలుగా ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు రూ. 20 వేలు, పాలిటెక్నిక్‌ పిల్లలకు రూ.15 వేలు, ఐటీఐ పిల్లలకు రూ.10 వేలు ఇస్తున్నాం. చదువు కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలవ్వరాదని, ఇల్లు.. పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదన్న గొప్ప ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.

విద్యా రంగంలో గొప్ప మార్పులు 
► జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, బైజూస్‌తో ఒప్పందం.. ఇవి మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా కరిక్యులమ్‌లో మార్పులు చేశాం. 30–40 శాతం స్కిల్‌ ఓరియెంటెడ్‌గా, జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్పులు తెచ్చాం. 
► డిగ్రీ చదువుతున్న పిల్లలకు పది నెలలపాటు కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌లో రకరకాల వర్టికల్స్‌ తీసుకొచ్చాం. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని 1.60 లక్షల మందికి వాళ్లతో శిక్షణతో పాటు సర్టిఫికెట్స్‌ ఇప్పించాం. 
► రాబోయే తరంలో కాలేజీలు అవ్వగానే ఉద్యోగాలు సులభంగా వచ్చేలా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా విద్యా రంగంలో ప్రతి మార్పు వెనుక, అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక మీ పిల్లల భవిష్యత్‌ పట్ల ఒక గొప్ప బాధ్యత కనిపిస్తుంది.

రూ.53 వేల కోట్లతో సమూల మార్పులు
మూడేళ్లలో ఒక్క విద్యా రంగం మీద, పైన చెప్పిన పథకాల మీద మాత్రమే.. రూ.53 వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగనన్న అమ్మఒడి పథకానికే రూ.19,618 కోట్లు ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన కోసం రూ.11,715 కోట్లు, గోరుముద్దకు రూ.3,117 కోట్లు, జగనన్న విద్యా కానుకకు రూ.2,324 కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు 
రూ.4,895 కోట్లు ఖర్చు చేశాం. 
మన బడి నాడు–నేడు కింద ఇవాళ రూపుమార్చుకుంటున్న పాఠశాలలు మీకు కనిపిస్తున్నాయి. ఇంత వరకు పెట్టిన ఖర్చు, ఈ సంవత్సరం అయ్యేసరికి పెట్టబోతున్న ఖర్చు రెండూ కలిపితే రూ.11,669 కోట్లు. ఇవన్నీ కలిపితే రూ.53,338 కోట్లు ఒక్క విద్యా రంగం మీద ఖర్చు చేస్తున్నాం.

నాడు అవినీతి.. నేడు డీబీటీ 
► మీ అన్న, మీ తమ్ముడు ఇప్పుడు నేరుగా బటన్‌ (డీబీటీ–డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) నొక్కుతున్నాడు.. ఆ డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. 
► గతంలో స్కీం అంతా స్కాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక చంద్రబాబు వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీరు మాత్రమే దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పథకం. ఇప్పుడు దానికి అడ్డుకట్ట పడిందని వాళ్లకు కడుపు మంట. 
► నాకున్నది, వారికి లేనిది దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు. ఆ రెండూ నాకు ఉన్నంత వరకూ మీ కోసం ఎన్ని అడుగులు అయినా ముందుకు వేసాను. అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా, రక్షణ పరంగా.. అన్ని విషయాల్లోనూ మీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని.. ఆత్మీయత, అనురాగానికి ప్రతీక అయిన రక్షా బంధనం దినోత్సవాన కోరుకుంటున్నాను. 
► ఈ సభలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ, ఉప సభాపతి కోన రఘుపతి, ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

పిల్లల భవిష్యత్‌ బావుండాలని ఆరాటం 
► మన పిల్లల భవిష్యత్‌ బావుండాలని ఆరాట పడుతూ ఇంతగా ఖర్చు చేస్తున్నాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల వల్ల కాలేజీల్లో 18–23 ఏళ్ల పిల్లల సంఖ్య (జీఈఆర్‌) గణనీయంగా పెరుగుతోంది. తద్వారా మనం బ్రిక్స్‌ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) దేశాలతో పోటీ పడతాం. 
► 18–23 ఏళ్ల పిల్లలు బ్రెజిల్‌లోని కాలేజీల్లో 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం, ఇండియాలో కేవలం 29 శాతం మాత్రమే ఉంది. దీన్ని 2035 నాటికి మన రాష్ట్రంలో 70 శాతం వరకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తున్నాం. 
► 2018–19తో పోల్చితే 2019–20లో జీఈఆర్‌ 8.64% పెరిగింది. ఇది జాతీయ స్థాయిలో కేవలం 3.04 శాతం మాత్రమే పెరిగింది. మన పథకాల వల్లే ఈ ప్రగతి సాధ్యమైంది.  
► ఆడ పిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ 11.03 శాతం వృద్ధి నమోదు కాగా, దేశ వ్యాప్తంగా కేవలం 2.28 శాతం మాత్రమే. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 2018–19తో పోల్చితే 2019–20లో రాష్ట్రంలో 7.5 శాతం జీఈఆర్‌ పెరగ్గా.. దేశం మొత్తం మీద పెరుగుదల కేవలం 1.7 శాతం మాత్రమే. ఎస్టీ విద్యార్థులకు సంబంధించి జీఈఆర్‌ పెరుగుదల రాష్ట్రంలో 9.5 శాతం కాగా.. జాతీయ స్థాయిలో అది కేవలం 4.7 శాతం మాత్రమే.  

ఒక్కసారి ఆలోచించండి
► ఇవాళ చాలా మంది గిట్టని వాళ్లు అమ్మఒడి పథకాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. జగన్‌  అక్కచెల్లెమ్మలకు డబ్బులు ఉదారంగా ఇచ్చేస్తున్నాడు అంటున్నారు. ఇలాగైతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. 
► 2018లో ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కొన్ని గణాంకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రాథమిక విద్యలో జీఈఆర్‌ రాష్ట్రంలో 84.48% ఉంటే.. దేశం మొత్తం సరాసరి 99 శాతం. అంటే దేశం మొత్తంగా పోలిస్తే ఏపీలో తక్కువగా కనిపిస్తోంది. 
► ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లలను చదివించాలి.. వారు దేశంతో పోటీపడాలి.. అనే ఉద్దేశంతో ఆ పిల్లలను బడికి పంపించేందుకు తల్లులకు తోడుగా నిలుస్తూ అమ్మఒడి పథకం అమలు చేస్తున్నాం. ఏవేవో మాట్లాడుతున్న పెద్ద మనుషులు ఈ వాస్తవాలు గమనించాలి.  
► ఈ రోజుకు, గత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలి. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పుల గ్రోత్‌ రేట్‌ చూస్తే.. గత పాలనలో 19% సీఏజీఆర్‌ ఉంటే, మన హయాంలో అప్పుల గ్రోత్‌ రేటు అంతకన్నా తక్కువ. 15% మాత్రమే. అప్పుడు, ఇప్పుడు తేడా ఏమిటంటే ఒక్క సీఎం మాత్రమే మారాడు. గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ అన్న, మీ తమ్ముడు ఎలా చేయగలుగుతున్నారో ఆలోచించండి.
చదవండి: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement