
సాక్షి, విజయవాడ: జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) విజయవాడలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా, నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో చికిత్స నిమిత్తం ఆయన ప్రైవేటు ఆసుత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అంబటి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు.. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విజయవాడ ప్రెస్‌క్లబ్, అమరావతి ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు కూడా సంతాపం తెలిపారు.
ఇక, విజయవాడ బావాజీపేటలోని ఆయన నివాసం నుంచి సోమవారం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అంబటి ఆంజనేయులు ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సలహాదారుడిగా ఆయన సేవలందించారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసి అన్ని జిల్లాల్లో యూనియన్‌ను విస్తరింపజేశారు. ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నాన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్థిక సాయం
Comments
Please login to add a commentAdd a comment