
చెన్నైకి వెళ్లి పింఛన్ అందిస్తున్న వలంటీర్ వరకుమార్
సాక్షి, బద్వేలు అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థలోని వలంటీర్లు అందిస్తున్న సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బద్వేలు మున్సిపాలిటీలోని 23వ వార్డు సచివాలయం పరిధిలో పనిచేస్తున్న ముండ్లపాటి వరకుమార్ అనే వలంటీర్ అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 31వ వార్డులోని సురేంద్రనగర్‌కు చెందిన రాచర్ల లక్ష్మిదేవి 111612177 ఐడితో వితంతు పింఛన్ తీసుకుంటోంది. అయితే ఆమె కుమారుడికి అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా చెన్నైలో ఉండి చికిత్స చేయించుకుంటోంది. నిబంధనల ప్రకారం వరుసగా మూడునెలలు పింఛన్ తీసుకోకుంటే హోల్డ్‌లో ఉంచుతారు. (చదవండి: అయ్యో పాపం: పింఛన్ కోసం వెళ్లి..)
ఇది గమనించిన వలంటీర్ స్థానిక వార్డు ఇన్‌చార్జి యద్దారెడ్డితో చర్చించాడు. అసలే పేదరికంతో ఉన్న మహిళకు పింఛన్ రాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి చెన్నైకి వెళ్లి పింఛన్ అందించి రావాలని కోరాడు. దీంతో వలంటీర్ వరకుమార్ చెన్నైలోని ఆసుపత్రి వద్దకు వెళ్లి సదరు మహిళకు 3నెలల పింఛన్ అందించి తనలోని సేవా నిరతిని చాటుకున్నాడు. అసలే కష్టాల్లో ఉన్న తనకు సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చి పింఛన్ అందించిన వలంటీర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ కె.వి.కృష్ణారెడ్డి, సచివాలయ సిబ్బంది వరకుమార్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment