దేవనకొండ(కర్నూలు జిల్లా): పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించడం సాధ్యమేనా? అవి నిలబడతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు కరిడికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బొమ్మదేవత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఏనుగుల సంచారం ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం..
చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్‌సీపీ రెపరెపలు
మండల కేంద్రమైన దేవనకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కరిడికొండ గ్రామం ఉంది. కొండల మధ్య చదును ప్రాంతంలో 1952 వరకు పాత ఊరు ఉండేది. ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొండల మధ్య కుంట ప్రాంతంలో ఊరు ఉండడంతో కన్నపుకుంటగా పిలిచేవారు. అయితే కుంటలో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చేవి. దీంతో కాలక్రమేణా ఈ ఊరికి ‘కరి’డికొండ అనే పేరొచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు.
గ్రామంలో ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు ఉండేవి. చిన్నరాళ్లపై నిలబడిన పెద్దరాయిని గ్రామస్తులు బొమ్మ దేవతగా కొలుస్తున్నారు. ప్లేగు వ్యాధి రావడంతో పాత ఊరంతా ఖాళీ చేసి కొందరు పక్క గ్రామాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన తిమ్మప్ప, రామప్ప అనే కుటుంబాలకు చెందిన వారు కొండపైకి వెళ్లి పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండలో బండలను తొలుస్తూ, రాళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొమ్మదేవత ఊరిని కాపాడుకుంటూ వస్తోందని గ్రామస్తుల నమ్మకం. శ్రావణమాసంలో ఆ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కనిపించని పూరి గుడిసె
గ్రామంలో ప్రస్తుతం 2,450 మంది నివసిస్తున్నారు. 1,619 ఎకరాల్లో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. పచ్చని పైర్లతో, చుట్టుతా చిన్న చిన్న కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పునాదులు లేకుండా ఇల్లు నిర్మించుకోవడంతో రూ.3 లక్షల వరకు ఆదా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడా పూరిగుడిసె లేదు. కొండపై తిమ్మప్పస్వామి దేవాలయం ఉంది. గ్రామ సమీపంలోని కొండల నుంచి రాళ్ల తొలచి, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. గ్రామంలో గతంలో 80 గృహాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 210కి చేరుకుంది.
ఎలాంటి ఇబ్బందులూ లేవు
కరిడికొండలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. కొండ ప్రాంతం కావడంతో ఇళ్లు కూలే అవకాశమే లేదు. నేరుగా నిర్మాణాలను చేపట్టవచ్చు.
– అవినిధ్, హౌసింగ్ ఏఈ
ఇల్లు కట్టుకోవడం చాలా సులభం
కొన్నేళ్ల నుంచి మేం ఇక్కడే నివాసం ఉంటున్నాం. పునాది తీయకుండా ఇల్లు కట్టుకున్నాం. గ్రామంలో డ్రెయినేజీ సమస్య లేదు. మా ఊళ్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులభంగా. పక్కనే రాళ్లు కూడా దొరుకుతాయి.
– పీరా, కరిడికొండ గ్రామస్తుడు
అన్ని సౌకర్యాలు ఉన్నాయి
మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించింది. గ్రామస్తులు సమీప కొండల్లో కారి్మకులుగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మా గ్రామం ఎత్తైన కొండపై ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు కరిడికొండ నుంచే రాళ్లు తరలిస్తున్నాం.
– నాగేష్, కరిడికొండ గ్రామస్తుడు
Comments
Please login to add a commentAdd a comment