ఏటీఎం పద్ధతిలో వినూత్నంగా సాగు చేస్తున్న సన్నకారు రైతు నారాయణప్ప దంపతులు
సాక్షి, అమరావతి: అతనో సన్నకారు రైతు. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి, ఆర్‌ఈఎక్స్, కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ‘కర్మవీర చక్ర’ పురస్కారం నారాయణప్పను వరించింది.
గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతిగడించిన దివంగత శాస్తవేత్త ఎంఎస్ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళా రంగంలో కాజోల్ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటుదక్కించుకున్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు ‘కర్మ వీర గ్లోబల్ ఫెలోషిప్’ (2023–24) కూడా అందిస్తారు.
ఏడాది పొడవునా ఆదాయమే
వ్యవసాయం కలిసి రాక కొంతకాలం భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసిన నారాయణప్ప తిరిగి పొలం బాట పట్టాడు. తండ్రి నుంచి వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయన రహిత సాగుకు శ్రీకారం చుట్టాడు. అందరిలా ఏడాదికి రెండు పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడులొచ్చేలా ఎనీ టైం మనీ (ఏటీఎం) విధానానికి శ్రీకారం చుట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తూ కరువు నేలలో సిరుల పంట పండిస్తున్నారు.
ఇంటికి సరిపడా పంట ఉంచుకుని మిగిలిన వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జిస్తున్నాడు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయాన్ని రాబట్టి తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలు పొందవచ్చని రుజువు చేసి చూపించాడు. తాను ఆర్థికంగా ఎదగడంతోపాటు సమాజానికి సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ.. తోటి రైతులకు కొత్త తరహా సాగు విధానాన్ని పరిచయం చేశాడు. గ్రామంలోనే తనతో పాటు మరో 25 మందికి ఏటీఎం మోడల్ సాగును నేర్పించాడు. వీరందరినీ చూసి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణప్ప బాటలో అడుగులేస్తూ సిరులు పండిస్తున్నారు.
ఐకాంగోను ఆకట్టుకున్న ఏటీఎం
నారాయణప్ప చేపట్టిన ఈ వినూత్న సాగు విధానం (ఎటీఎం) ఐకాంగోను ఆకర్షించింది. దీనిపై సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసింది. ఈ వినూత్న విధానంలో మట్టి, భూమి ఆరోగ్యంగా మారడంతోపాటు భూమి మెత్తబడి ఆకు, కాండం ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఏటీఎం మోడల్‌లో సాగు చేయడం ద్వారా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ‘క్త్లెమేట్ ఛేంజ్’ సాధ్యమవుతోందని గుర్తించారు. ఏటీఎం మోడల్‌ను ప్రపంచంలోనే ఏ గ్రేడ్ మోడల్‌గా గుర్తించడంతోపాటు ఏడాది పొడవునా పంటలు పండించడం ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించడంతో పాటు నేలల్లో కర్బన స్థిరీకరణకు దోహదపడేలా కృషి చేస్తూ నారాయణప్ప రైతుల పాలిట ‘ఛేంజ్ ఏజెంట్’ నిలిచారని పేర్కొంటూ ఆయనను 2023–24 సంవత్సరానికి ‘కర్మ వీర్ చక్ర’ అవార్డుకు ఎంపిక చేశారు.
గర్వంగా ఉంది
మార్పు అనేది మనతోనే మొదలవ్వాలన్నది నా ఆలోచన. వ్యవసాయంలో ఏడాది పొడవునా ఆదాయం ఎందుకు రాదన్న ఆలోచన నుంచి పుట్టిందే ఏటీఎం మోడల్. రైతు సాధికార సంస్థ వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నాను. పట్టుదల, నిరంతర శ్రమతో తగిన ప్రతిఫలం పొందుతున్నా. నేను చేస్తున్న సాగు విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వంగా ఉంది.
– ఎం.నారాయణప్ప, మల్లాపురం, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment