
సాక్షి , అమలాపురం: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో ఏపీలోని కోనసీమ ప్రాంతంలోని ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. కనుమ పండుగ రోజు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థంను శకటంగా రూపొందించారు. వేడుకల్లో మొత్తం 17 రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించగా..అందులో ఏపీ నుంచి ప్రభలతీర్థం ఒకటి కావడం విశేషం. ఈ పరేడ్‌లో పాల్గొన్న వారు ‘సాక్షి’తో తమ భావాలను ఇలా పంచుకున్నారు.
ఈ సారి ప్రత్యేకం
గతంలో నాలుగుసార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాను. కాని ఈసారి ప్రత్యేకం. మన ప్రాంతానికి చెందిన ప్రభ శకటం కూడా వెళ్లడం చాలా సంబరంగా అనిపించింది. మన ప్రభను అందరూ ప్రత్యేకంగా తిలకించారు. కొంతమంది భక్తితో నమస్కరించారు. ఇది మన ప్రాంతానికి దక్కిన గుర్తింపు.
– చింతా వీరాంజనేయులు
జన్మ ధన్యమైంది
నాద బృందంలో ఇప్పటివరకు మా నాన్న పసులేటి నాగబాబు 15 సార్లు రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నారు. నేను పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం ఎప్పుడు దక్కుతుందా అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గతంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, ప్రతిభాపాటిల్, ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మేము ప్రదర్శనలు చేసినా కవాతులో పాల్గొనడం ఇదే తొలిసారి.
ఏకాదశ రుద్రులతో ఉన్న ఏపీ శకటాన్ని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా తిలకించారు. విదేశీ ప్రముఖులు పక్కవారిని వివరాలు అడుగుతూ కనిపించారు. 10.51కి శకటం ప్రయాణం ప్రారంభం కాగా, కవాతు ముగిసి ఎర్రకోటకు చేరే సరికి 01.15 అయ్యింది.
– పసుపులేటి కుమార్, ముక్కామల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment