మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం సహజంగానే కలకలం సృష్టిస్తుంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు వివాదాస్పదంగా సాగుతున్నదన్న అభిప్రాయం చాలాకాలంగా ఉంది. ఒక కోణంలోనే విచారణ చేయవలసిన అవసరం ఎందుకు సీబీఐకి వచ్చిందన్నది అర్ధంకాని విషయం. మన దేశంలో ఏ విచారణ సజావుగా జరుగుతోందో, ఏది జరగడం లేదో తెలియని పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం. వివేకా హత్య దర్యాప్తు కూడా ఆ కోవలోకే చేరుతోందన్న భావన వ్యక్తం అవుతోంది. హత్య చేసిన వ్యక్తిని అప్రూవర్‌గా మార్చుకుని ముందస్తు బెయిల్ ఇచ్చిన ఘటన బహుశా మన దేశంలోనే జరుగుతుందేమో!
అసలు నిందితుడిని వదిలేయడం అనుమానాలకు తావివ్వదా?
వివేక హత్య కేసులో తానే హత్య చేశానని చెప్పిన వ్యక్తికి ఎలా బెయిల్ లభించింది. హత్య వెనుక కుట్రదారులు ఎవరైనా ఉంటే వారిని పట్టుకోవచ్చు. కాని అసలు నిందితుడిని అరెస్టు చేయకుండా వదలివేసిన తీరు అనుమానాలకు తావివ్వదా?వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన కుమార్తె సునీత కొన్నాళ్లపాటు చెప్పిన విషయాలకు, ఆ తర్వాత ఆరోపిస్తున్న అంశాలకు ఎందుకు తేడా ఉంటున్నది? అందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్నది ఆలోచించవలసిన బాధ్యత సీబీఐపై ఉండదా !అప్పట్లో టీడీపీ నేత ఆదినారాయణరెడ్డిపై ఆమె ఎందుకు ఆరోపణలు చేశారు.
ఆయనను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షిస్తున్నారని ఎందుకు ఆరోపించారు. ఇప్పుడు ఆమె ఎందుకు మాట మార్చారు?ఇందులో ఆమె కుటుంబానికి సంబంధించి రాజకీయ ప్రయోజనం కూడా ఏమైనా ఉందా అన్న అంశంలో పరిశీలన జరగాలా?వద్దా? హత్య జరిగిందే చంద్రబాబు పాలన టైమ్ లోనే కదా! అప్పుడు రాని అభియోగాలు , ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సీబీఐకి సుప్రింకోర్టు ఈ నెలాఖరులోగా దర్యాప్తు తేల్చాలని ఆదేశించడంతో హడావుడిగా కేసును ముగించడానికి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారా? అవినాశ్ రెడ్డిని కూడా ఇప్పటివరకు మూడు,నాలుగుసార్లు విచారించారు. మొదట్లో ఆయన తన వాదనలను బయట చెప్పేవారు కారు. కాని పరిస్థితి చేయిదాటిపోతోందని, అక్రమంగా తమపై అబియోగాలు వస్తున్నాయని సంశయించి ఆయన వివేకానందరెడ్డికి సంబందించిన పలు వ్యక్తిగత కోణాలను వెల్లడించారు.
అప్పుడు వివేకాను చంద్రబాబు ఓడించడం వాస్తవం కాదా?
అంతవరకు వివేకా ముస్లిం మతంలోకి మారి, పేరు మార్చుకుని చేసుకున్న రెండో పెళ్లి, తద్వారా కలిగిన సంతానం, ఆస్తి వివాదం, కుమార్తె సునీత కుటుంబంతో ఆయనకు ఉన్న సంబందాలు మొదలైన వాటిపై నోరు విప్పారు. అవినాశ్ ఆ విషయాలు చెప్పిన తర్వాత అయినా సీబీఐ ఆ కోణంలో కూడా పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉండాలి కదా? కాని భాస్కరరెడ్డిని, అవినాశ్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగానే సీబీఐ వ్యవహరించిందన్న అనుమానం కలగడం ఆ దర్యాప్తు సంస్థకు మంచిదేనా! వైఎస్ వివేకా తన అల్లుడి ఒత్తిడితోనే అప్పటి రాజకీయ పరిణామాలలో జగన్‌కు దూరంగా కాంగ్రెస్ లో కొనసాగి మంత్రి పదవి చేపట్టారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మపై పోటీచేశారా?లేదా? అయినా ఆ తర్వాత కాలంలో వివేకాను వైసీపీలోకి జగన్ తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల టిక్కెట్ ఇచ్చారు కదా!
వాటిని సాయంత్రం వరకూ ఎందుకు రహస్యంగా ఉంచారు?
కడప జిల్లాలో వివేకా గెలిచే ఓట్లు ఉన్నా, ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్యాంప్ రాజకీయాలు నడిపి ఆయనను అక్రమంగా ఓడించడం వాస్తవం కాదా? అవినాశ్ రెడ్డి 2014లోనే ఎంపీగా ఎన్నికయ్యారు. తిరిగి ఆయనకే 2019లోనే టిక్కెట్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆయన కోసం వివేకా ప్రచారం చేసింది వాస్తవం కాదా? అలా ప్రచారం చేసిన వ్యక్తిని రాజకీయ కారణాలతో హత్య చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? వైఎస్ కుటుంబంలో ఒకరినొకరు చంపుకునే సంస్కృతి, చరిత్ర లేదని ఆ రోజుల్లో చెప్పిన సునీత ,తదుపరి ఎందుకు భిన్న వైఖరికి వెళ్లారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన చేతి రాతతో ఉన్న లేఖను ,సెల్ ఫోన్‌ను ఆయన అల్లుడు ఎన్.రాజశేఖర్‌రెడ్డి ఎందుకు సాయంత్రం వరకు రహస్యంగా ఉంచారు.
దానికి కారణాలు ఏమిటో సీబీఐ విచారణ చేసిందా? చేసి ఉంటే ఆ వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదు? ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన డి.శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ సీబీఐ దర్యాప్తుపై తన అభ్యంతరాలు చెబుతూ కోర్టులో పిటిషన్ వేశారు. అయినా సీబీఐ వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు?ఈ కేసు మొత్తాన్ని ఎలాగొలా ముఖ్యమంత్రి జగన్ దాకా చుట్టాలని తెలుగుదేశం పార్టీ , ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు మరింత అనుమానానికి దారి తీస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అన్న పేరు ఉన్న ఈయన వచ్చే ఎన్నికలలో రాజకీయ లబ్ది పొందడం కోసం ఇందులో ఏమైనా కుట్రలు చేస్తున్నారా అన్నది పలువురి ప్రశ్న గా ఉంది.
డాక్యుమెంట్ల చోరీని ఎందుకు సీబీఐ పట్టించుకోవడం లేదు?
జగన్ అమలు చేస్తున్న వివిధ స్కీములతో ప్రజలలో పెరిగిన ఆదరణను దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీతో పాటు, ఈనాడు తదితర టీడీపీ మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. రామోజీ వందల కోట్ల మేర డిపాజిట్ల స్కామ్ చేశారని సీఐడీ కనిపెడితే అదేమో కుట్ర అని ప్రచారం చేస్తారు.వివేకా హత్య కేసును మాత్రం వైసీపీకి అంటగడతారు. సీబీఐవిచారణ గొప్ప విషయంగా చెబుతారు. అదే సీఐడీ దర్యాప్తుపై మాత్రం గగ్గోలు పెడతారు?ఇక్కడే వారి ద్వంద్వ నీతి కనిపిస్తుంది. మార్గదర్శి కేసులో నిర్దిష్ట ప్రశ్నలకు యాజమాన్యం సమాధానం ఇవ్వలేకపోతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐచేస్తున్న దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని క్లారిఫై చేయకుండా సీబీఐతన మానాన తాను వెళుతోంది. ఈ తేడాను అంతా గమనించాలి. దేశ వ్యాప్తంగా సీబీఐ ఆయా కేసులలో అనుసరిస్తున్న వైనంపై కూడా విమర్శలు వస్తున్నాయి. కడపలో కూడా అలాగే ఫెయిర్ గా దర్యాప్తు చేయడం లేదన్న భావన వస్తోంది. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలను సీబీఐ కనీసం పరిగణనలోకి తీసుకోకుండా దర్యాప్తు జరుపుతోందంటే ఆశ్చర్యమే అనిపిస్తుంది.
ఎంపీ లేఖ రాసినా సీబీఐ పట్టించుకోకపోతే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది? తండ్రి భాస్కరరెడ్డి అరెస్టు తర్వాత అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరోసారి తన అభియోగాలన్నీ వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలలో కీలకమైనది ఏమిటంటే వివేకకు సంబంధించిన డాక్యుమెంట్ల చోరిని ఎందుకు సీబీఐ పట్టించుకోవడం లేదన్నది. అలాగే వాచ్ మన్ రంగయ్య స్టేట్ మెంట్ ను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన అడిగారు?హత్య చేసినట్లు ఒప్పుకున్న వ్యక్తి అప్రూవర్ గా మారినా జైలులోనే ఉంచాలని ఐపిసిలో లేదా అని ఆయన ప్రశ్నించారు.వివేక హత్య గురించి తొలుత ఆయన అల్లుడికే తెలుసునని అవినాశ్ చెప్పారు.
ఏది ఏమైనా సీబీఐ దర్యాప్తు లొసుగులతో సాగితే ఆ సంస్థకే అప్రతిష్ట అవుతుంది.చివరికి హత్య వెనుక ఉన్న కుట్రదారులను తేల్చే క్రమంలో ఈ మొత్తం దర్యాప్తు తీరే ఒక కుట్ర గా మారుతోందన్న విమర్శ రావడం సీబీఐవిశ్వసనీయతను దెబ్బతీస్తుంది.ఇంకో వైపు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగితే, దాని వెనుక కుట్ర లేదని ప్రచారం చేస్తారు. చిత్రం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణ తన ఇంటిలో ఇద్దరిని తుపాకితో కాల్చినా , ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డు ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించినా, ఆయనకు ఏమి కాలేదు.జైలు గుమ్మం దాకా కూడా వెళ్లలేదు. అదే ఇంకెవరైనా అయితే అలాగే ఊరుకుంటారా? మానసిక పరిస్థితి సరిగా లేక బాలకృష్ణ తుపాకి కాల్పులు జరిపారని ఒక డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇవ్వడం కూడా ప్రత్యేకతే.ఆ తర్వాత అదే బాలకృష్ణ కు తెలుగుదేశం టిక్కెట్ ఇవ్వడం, ఆయన రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికవడం జరిగింది. మన దేశంలోనే ఇలా జరుగుతుందేమో!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment