మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ పోరాట యోధుడు. పట్టు వీడకుండా దేశంలోనే అతికొద్ది మంది అత్యంత శక్తివంతులలో ఒకరైన ఈనాడు అధినేత రామోజీరావుపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. ఎలాగైతే కొంతమేర సాదించగలిగారు. మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో గతంలో రామోజీ పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు. అది ఆర్బీఐ చట్టంలోని 45 ఎస్ ప్రకారం నేరం. అలా చేసినవారికి జైలు శిక్షతో పాటు, రెట్టింపు జరిమానా విధించాలని నిబందన చెబుతోంది. రామోజీరావు హెచ్‌యుఎఫ్ పేరుతోనో ,ప్రొప్రైటర్ షిప్ పేరుతోనే 2600 కోట్ల డిపాజిట్లు సెకరించారు. దీనిపై ఎప్పుడో 2007లో ఉండవల్లి కేసు వేశారు.
ఇలా డిపాజిట్లు వసూలు చేసి ఇతర చోట్ల పెట్టుబడితే ప్రజలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించి ఈ వ్యవహారాలపై విచారణ జరిపించింది. తత్ఫలితంగా రామోజీ 2600 కోట్లను చెల్లించేసినట్లు ప్రకటించారు. మంచిదే. అయితే అసలు నేరం చేశారా?లేదా అన్న సమస్య అలాగే ఉంది. ఎవరైనా దొంగతనం చేసి, ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తే నేరం కాకుండా పోతుందా?అలాగే రామోజీ చట్టాన్ని పాటించకుండా డిపాజిట్లు సేకరించారా?లేదా? ఆ డిపాజిట్లు ఎవరెవరినుంచి సేకరించారు? వారి వివరాలు ఏమిటో చెప్పాలన్నది ఉండవల్లి డిమాండ్. దీనిపై రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారట. డిపాజిటర్ల వివరాలు ఇస్తే వైఎస్ ప్రభుత్వం కక్ష కడుతుందని అప్పట్లో వాదించారట. ఇంతలో రాష్ట్ర విభజన జరిగింది. తదుపరి హైకోర్టు కూడా కూడా విభజన జరిగి ఏపీకి మారే ముందు రోజున ఎందువల్లో హైకోర్టులో రామోజీ డిపాజిట్ల సేకరణ కేసు కొట్టేశారట.
దానిని కనీసం ఉండవల్లికి చెప్పలేదట. ఎలాగో కొంతకాలానికి ఆ సమాచారం అందుకున్న ఉండవల్లి మళ్లీ తన పోరాటం కొనసాగించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ దానిని అనుమతించడం రామోజీకి ఇబ్బందిగా మారింది. ఈ మధ్య లో రామోజీ కోర్టులో ఉండవల్లిపై పరువు నష్టం దావా వేశారట. ఆ దావా గురించి అయినా ఉండవల్లి ఈ కేసు సంగతి తేల్చవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అన్నిటిని కూలంకశంగా అధ్యయనం చేసే ఆయన తన పట్టు బిగించారు.
డిల్లీలో తనకు తెలిసిన ఒక లాయర్‌ను వినియోగించడమే కాకుండా, అవసరమైతే తానే స్వయంగా హాజరు కావడం వంటివి చేస్తూ వస్తున్నారు. అలా పదహారేళ్ల క్రితం మొదలైన ఈ కేసు ఇప్పటికి ఒక దశకు చేరిందని అనుకోవాలి. ఇంతకాలం తనకు ఎదురు లేకుండా సాగుతున్న రామోజీకి సడన్ గా ఒక ఎదురు దెబ్బ తగిలినట్లయింది. తను సేకరించిన డిపాజిట్లు, డిపాజిట్ దారుల వివరాలు, వాటిని వసూలు చేసిన తీరు మొదలైన వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిజానికి అందరికి నీతులు చెప్పే రామోజీ ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది. 2007లో డిపాజిట్ల వసూలుపై కేసు వచ్చినా, మరో రూపంలో మళ్లీ డిపాజిట్లు వసూలు చేస్తున్నారని ఇటీవల ఏపీ సీఐడీ అభియోగం మోపింది.
అంతేకాదు. సుమారు 600 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి మార్గదర్శిని మార్గంగా ఎంచుకున్నారని సీఐడీ కనిపిట్టినట్లు వార్తలు వస్తున్నాయి.బహుశా ఈ నేపద్యంలోనే అది బయటపడరాదనే కావచ్చు.. మార్గదర్శి చిట్ ఫండ్ రికార్డులను ఇవ్వడానికి కూడా రామోజీ ఇష్టపడడం లేదు. పారదర్శకత గురించి సుద్దులు చెప్పే ఆయన తన వద్దకు వచ్చేసరికి అంతా రహస్యం అని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇందులో రహస్యం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పుడు ఆయన డిపాజిట్ దారుల వివరాలు ఎలా ఇస్తారన్నది ఆసక్తికరమైన విషయంగా ఉంది. ఆ వివరాలు ఇవ్వకుండా రామోజీ ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారేమో చూడాల్సి ఉంది.
సుప్రీంకోర్టులో మాత్రం ఆ వివరాలు ఇస్తామని చెప్పారు. అలా చేస్తే మంచిదే. ఈ సందర్భంలో ఉండవల్లి ఒక మాట చెబుతున్నారు. రామోజీని జైలులో పెట్టాలని ,శిక్షలు వేయాలని కోరుకోవడం లేదని, కాని చట్టం రామోజీకి వర్తిస్తుందా?లేదా? ఆయన తప్పు చేశారా?లేదా? డిపాజిట్ దారుల నుంచి డబ్బు చెక్‌ల రూపంలో తీసుకున్నారా?లేక వేరే రూపాలలో తీసుకున్నారా?ఇలాంటి విషయాలు బయటకు రావాలన్నది తన కోరిక అని అన్నారు. ఇందులో తప్పు తేలితే రామోజీకి ఒక రూపాయి ఫైన్ వేసినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఇక ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తన వాదనపై అఫిడవిట్ వేయవలసి ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని రామోజీ మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఏపీలో మాత్రం ఆయన పప్పులు ఉడకడం లేదు. చిట్ ఫండ్ డబ్బు మొదలు, పరోక్షంగా రశీదుల రూపంలో డిపాజిట్ల సేకరణ తదితర అవకతవకలపై సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఉండవల్లి చేస్తున్న డిమాండ్ , ఆయన పోరాటంలో హేతుబద్దత కనిపిస్తుంది. ఆయన ఏదో ద్వేషంతో చేయడం లేదు. ఒక కాజ్ గురించి ,రాజ్యాంగం రామోజీకి వర్తిస్తాయా?లేదా? అన్నది తేల్చుకోవడం కోసం ఇంతకాలంగా పోరాడుతున్నారు. వచ్చే నెలల్లో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో కాని, ఇప్పటికైతే రామోజీపై ఉండవల్లి ఎంతో కొంత పైచేయి సాధించగలిగారని చెప్పాలి. .రామోజీరావు కూడా రాజ్యాంగానికి అతీతుడు కాడని కొంతవరకైనా ఉండవల్లి అరుణకుమార్ రుజువు చేయగలిగారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment