హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న లక్ష్మీపార్వతి
ఖైరతాబాద్(హైదరాబాద్): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. 74 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్‌ను అవమానాలకు గురిచేసి, చివరకు ఆయన చనిపోయేలా చేశావో, అదే 74వ ఏట మీరు చేసిన పాపాలు పండి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన ఈ ఉద్వేగభరిత క్షణాల్ని నా భర్త సమాధితో పంచుకోవాలని ఇక్కడకు వచ్చి నివాళులు అర్పించినట్టు చెప్పారు.
చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేడని ఎన్టీఆర్ ఆనాడు చెప్పిన మాటల్ని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలనే ఇంతకాలం బతికున్నానని, నా ఆశయం నా భర్త నిర్దేశించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడు.
ప్రజల సొమ్ము దోచుకొని, అవినీతి కేసుల్లో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, అధికారం అడ్డుపెట్టుకొని వ్యవస్థలను కొనుక్కోవడం చేస్తూ వచ్చాడని, చివరికి అదే వ్యవస్థలో చిక్కుకుపోయి జైలు పాలయ్యాడని, ఇప్పుడు నా కోపం అంతా తీరిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికైనా ఆలోచించాలని, చంద్రబాబు అక్రమాలను మీరు సహిస్తారా... ప్రజాధనం లూటీ చేస్తూ దొరికిపోయాడు, ఆలోచించండన్నారు. నిప్పులాగా బతికిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎక్కడ, అధికారం కోసం తడిగుడ్డతో గొంతులు కోసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు గురించి తెలుసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment