కోవిడ్‌ నష్టం.. పూడ్చడం కష్టం! | Lockdown Impact On Power Sector In AP | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ నష్టం.. పూడ్చడం కష్టం!

Published Thu, Oct 29 2020 7:54 PM | Last Updated on Thu, Oct 29 2020 8:20 PM

Lockdown Impact On Power Sector In AP - Sakshi

సాక్షి, అమరావతి : వార్షిక, ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్‌ఆర్‌) సమర్పించేందుకు విద్యుత్‌ సంస్థలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నవంబర్‌ చివరి నాటికి ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని డిస్కమ్‌లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లు ఇప్పటి వరకు ఉన్న ఆదాయ వివరాలు, వచ్చే ఏడాదికి కావాల్సిన రెవెన్యూను అంచనా వేస్తున్నాయి. ఏపీఈఆర్‌సీ ఇచ్చిన గడువులోగానే ఏఆర్‌ఆర్‌లు సమర్పిస్తామని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. దీనిపై కమిషన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, వచ్చే ఏడాదికి అనువైన టారిఫ్‌ను ప్రకటిస్తుంది. ఈ టారిఫ్‌ వచ్చే ఏప్రిల్‌ నుంచి అమలులోకి రావాల్సి ఉంది. 

తగ్గిన రాబడి.. పూడ్చడమెలా?
►ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆదాయానికి కోవిడ్‌-19 భారీగా గండికొట్టింది. ఆరు నెలలు గడిచినా పెద్దగా మార్పు కనిపించడం లేదు. సాధారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి ఉన్న గణాంకాలనే ఏఆర్‌ఆర్‌లోకి తీసుకుంటారు. దీని ఆధారంగా అంచనాలు రూపొందిస్తారు. 
►నిజానికి ఈ ఆరు నెలల కాలంలో డిస్కమ్‌ల ఆదాయం భారీగా తగ్గింది. గత ఏడాది (2019) రూ.11,038.35 కోట్లు ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.9,509.62 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ ఆర్ధ సంత్సరంలో రూ.1,528.73 కోట్ల రెవెన్యూ వసూళ్లు పడిపోయాయి.

గృహ విద్యుత్‌ పెరిగినా లాభం లేదు.. 
► లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌-జూన్‌ నెలల్లో గృహ విద్యుత్‌ వినియోగం పెరిగింది. 2019 ఆరు నెలల్లో గృహ విద్యుత్‌ రాబడి రూ.2,726.65 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం ఆరు నెలల్లో రూ.2,831 కోట్లు ఉంది. రూ. 104.35 కోట్లు పెరిగినా, డిస్కమ్‌లకు పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే గృహ విద్యుత్‌ను చాలా వరకు సబ్సిడీపైనే ఇస్తారు. మన రాష్ట్రంలో తక్కువ టారిఫ్‌ ఉంది. 

►డిస్కమ్‌ల నష్టాలను పూడ్చడంలో కీలక పాత్ర పోషించే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ రాబడి ఈసారి గణనీయంగా తగ్గింది. పారిశ్రామిక విద్యుత్‌ రెవెన్యూ 2019లో రూ.4,771.03 కోట్లు ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.3,754.19 కోట్లు మాత్రమే ఉంది. అంటే 1,016.84 కోట్లు తగ్గింది. వాణిజ్య విద్యుత్‌ రెవెన్యూ గత ఏడాది రూ.2,272.56 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం ఆరు నెలల్లో రూ.1,603.47 కోట్లు ఉంది. రూ.669.09 కోట్లు తగ్గింది.

►విద్యుత్‌ను వినియోగదారుడికి చేరవేయడానికి ప్రతి యూనిట్‌కు దాదాపు రూ.5.05 వరకు ఖర్చవుతుంది. గృహ వినియోగం వల్ల యూనిట్‌కు సగటున రూ.4.05 వరకు వస్తుంది. మిగతా మొత్తాన్ని పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ (క్రాస్‌ సబ్సిడీ) ద్వారా పూడ్చుకుంటారు. ఈసారి ప్రధాన ఆదాయ వనరులే దెబ్బతిన్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ బకాయిలను అప్పు చేసి మరీ ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా వడ్డీ భారం విద్యుత్‌ సంస్థలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో డిస్కమ్‌లు సమర్పించే ఏఆర్‌ఆర్‌లు కీలకం కాబోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement