24న వాయుగుండంగా మార్పు
25, 26 తేదీల్లో తుపానుగా మారనున్న వాయుగుండం
విశాఖ–తూర్పు గోదావరి మధ్య తీరాన్ని దాటే అవకాశం
ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రమంతా వర్షాలు
నేడు రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25, 26 తేదీల మధ్య ఇది తుఫాను లేదా తీవ్ర తుఫానుగా మారి విశాఖపట్నం – తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్ నుంచి కొమరిన్, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాయలసీమలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు ఉత్తరాం«ధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
వైఎస్సార్ కడప, పశ్చిమ ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
పలుచోట్ల వర్షాలు
శనివారం కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజలో 67.75 మిల్లీవీుటర్ల వర్షం పడింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40 మిల్లీవీుటర్లు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మదీనాపాడులో 37, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో 27.5, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 27 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.
ఉవ్వెత్తున అలలు
వాకాడు (తిరుపతి జిల్లా): వాతావరణంలో వచ్చిన మార్పులతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో శనివారం అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. సముద్రంపై పోరు గాలితోపాటు సుడులు తిప్పుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.
29న అండమాన్‌కు నైరుతినైరుతి రుతుపవనాలు ఈ నెల 29 నాటికి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1వ తేదీకి కేరళను రుతు పవనాలు తాకుతాయని, ఆ తర్వాత 2, 3 తేదీల్లో ఏపీకి విస్తరిస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment