సాగరమాలలో ఉత్తరాంధ్రకు సింహభాగం | Mansukh Mandaviya Comments About Uttarandhra | Sakshi
Sakshi News home page

సాగరమాలలో ఉత్తరాంధ్రకు సింహభాగం

Published Tue, Mar 9 2021 3:17 AM | Last Updated on Tue, Mar 9 2021 3:17 AM

Mansukh Mandaviya Comments About Uttarandhra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సాగరమాల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రకు సింహభాగం ప్రాజెక్టులు దక్కాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 40 ప్రాజెక్టులు విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు దక్కాయని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్‌లాల్‌ మాండవీయ సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా రూ.85,576 వేల కోట్లతో 92 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు మాండవీయ తెలిపారు. రూ.51 వేల కోట్ల విలువైన 29 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని, రూ.8,945 కోట్ల విలువైన 35 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు.

విశాఖ పోర్టు అభివృద్ధి ప్రాజెక్టులన్నీ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని, పోర్టుల ఆధునికీకరణ కింద శ్రీకాకుళం జిల్లా బారువ, కళింగపట్నం, విశాఖ జిల్లా భీమునిపట్నంలలో ప్రయాణికుల నిమిత్తం జెట్టీ నిర్మాణ ప్రాజెక్ట్‌లకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.2,352 కోట్లతో విశాఖలోని షీలానగర్‌ జంక్షన్‌ నుంచి అనకాపల్లి, సబ్బవరం, పెందుర్తి మీదుగా ఎన్‌హెచ్‌ 16కు కలిసేలా రోడ్డు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా రూ.138 కోట్ల వ్యయంతో గంగవరం పోర్టు నుంచి అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌ను నాలుగు వరుసల బీచ్‌ రోడ్డు అభివృద్ధి ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు.

గంగవరం పోర్టు నుంచి గాజువాకలోని ఎన్‌హెచ్‌ 16కు కలిసే నాలుగు వరుసల రోడ్డును ఆరు వరసల రోడ్డుగా అభివృద్ధి ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నారు. ఎన్‌హెచ్‌ 16పై మింది నుంచి నాతయ్యపాలెం వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణం, గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టును కలిపేలా నాలుగు వరసల కోస్టల్‌ రోడ్డు ప్రాజెక్ట్, నగరంలోని సీహార్స్‌ జంక్షన్‌ నుంచి డాక్‌ ఏరియాను కలిపేలా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ప్రాజెక్ట్‌ నిర్మాణం పరిశీనలో ఉన్నాయన్నారు. విశాఖలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్, షిప్‌ బిల్డింగ్‌ (సీఈఎంఎస్‌)ను రూ.574 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. రూ.500 కోట్ల వ్యయంతో ఔటర్‌ హార్బర్‌ నుంచి కాన్వెంట్‌ జంక్షన్‌ వరకు నాలుగు వరుసల రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం లభించిందన్నారు.

కాకినాడలోని హోప్‌ ఐలాండ్‌ను ప్రపంచస్థాయి కోస్టల్‌ ఎకో టూరిజమ్‌ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో రూ.242 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసే ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాజెక్ట్‌పై డీపీఆర్‌ సిద్ధం అవుతోందన్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో రూ.2,123 కోట్ల వ్యయంతో జీఎంఆర్‌ గ్రూప్‌ కొత్త పోర్టును అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విజయవాడ భవానీ ద్వీపంలో రూ.22 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం తలపెట్టిన జెట్టీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇవి కాకుండా ఏపీలో సాగరమాల కింద చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్‌ల పనుల పురోగతి గురించి మంత్రి గణాంకాలతో సహా వివరించారు.  

విద్యార్థినులకు సప్లిమెంటరీ సీట్లు  
ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సుల్లో విద్యార్థినుల ప్రవేశాల పెరుగుదల గమనించి వారికి సప్లిమెంటరీ సీట్లు ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. 2018–19లో 8 శాతం నుంచి 14 శాతానికి, 2019–20లో 17 శాతం, 2020–21లో 19.8 శాతానికి పెంచినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు బాలÔౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  

ఆ ప్రతిపాదన లేదు 
వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్‌ కులాల్లో చేర్చే ప్రతిపాదన ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సరూత సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  

ఒకే దేశం ఒకే గ్యాస్‌ గ్రిడ్‌ 
సహజవాయువుల మౌలికవసతుల అభివృద్ధి నిమిత్తం ‘ఒకే దేశం ఒకే గ్యాస్‌ గ్రిడ్‌’ అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. పెట్రోలియం, సహజవాయువుల నియంత్రణ బోర్డు పైపులైన్ల అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 18,400కి.మీ పైపులైను పూర్తవగా, 16,100 కి.మీ. వివిధ దశల్లో ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు అవినా‹Ùరెడ్డి అడిగిన ప్రశ్నకు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  

ఆనందవల్లి అమ్మవారి గుడిలో నంది ఇంకా లభ్యం కాలేదు  
చిత్తూరు జిల్లా గుడిమల్లాం శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నంది విగ్రహం 2017 అక్టోబర్‌ 10లో చోరీకి గురైందని, ఇప్పటి వరకు లభ్యం కాలేదని కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతా అడిగిన ప్రశ్నకు  మంత్రి ప్రహ్లాద్‌ జోషి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.  

రూ.5405.59 కోట్లు విడుదల 
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు మేరకు ఫిబ్రవరి 2021 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ డెఫిసిట్‌ రూ.5,405.59 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు పి.వి.మిథున్‌రెడ్డి, గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, కోటగిరి శ్రీధర్, ఎన్‌.రెడ్డెప్ప, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోచ బ్రహా్మనందరెడ్డి, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

మహిళా సాధికారత పెంచేలా చర్యలు తీసుకోవాలి 
మహిళా సాధికారత పెంచేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం లోక్‌సభలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. భారతీయ పురాణాలు, వేదాల్లో మహిళల ప్రాధాన్యం వివరించారు. మహిళలు సాధించిన పురోగతి అనుసరించే సమాజ పురోగతి అంచనా వేయొచ్చన్న అంబేడ్కర్‌ మాటలు ప్రస్తావించారు. మహిళల అభ్యున్నతి కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సేవలు సభ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులగా ఉన్న మహిళలకు మెటర్నిటీ సెలవులు అదనంగా కేటాయించారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొబైల్‌ కొనుగోలులో మహిళలకు 10 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడం వంటి అంశాలను వెల్లడించారు. మహిళా కారి్మకులకు ప్రోత్సాహకాలు నిమిత్తం కేంద్ర ప్రభుత్వం చేయదలచిన బిల్లును అన్ని పారీ్టల సహకారంతో త్వరగా పాస్‌ చేయాలని ఎంపీ సత్యవతి కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement