
సాక్షి, అమరావతి: డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇక్కడ కూర్చొని కెనడా, అమెరికా, జపాన్ తదితర దేశాలకు చెందిన ఉత్పత్తులను వారికే విక్రయించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కెనడాలో ఉన్న వ్యక్తి వెబ్‌పేజీలోకి వెళ్లి వారు కోరుకునే వస్తువులను ఇక్కడ నుంచే మార్కెటింగ్ చేయవచ్చు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు తోడు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, పేటీఎం యాప్స్ ద్వారా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో చాలా కంపెనీలు మానవ వనరులు చౌకగా లభించే మన దేశం నుంచే ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 4జీ టెక్నాలజీతో డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను విశాఖ నగరం సద్వినియోగం చేసుకుంటోంది.
అత్యధికంగా హెల్త్‌కేర్‌లో..
విశాఖ కేంద్రంగా పలు కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అత్యధికంగా హెల్త్‌కేర్ రంగానికి చెందినవే ఉన్నాయి. విశాఖ కేంద్రంగా పల్సస్ గ్రూపు 2,500 మందికి ఉపాధి కల్పిస్తుండగా డబ్ల్యూఎన్‌ఎస్, ఏసీఎన్ హెల్త్‌కేర్, ఏజీఎస్ హెల్త్‌కేర్ లాంటి సంస్థలు ఒక్కొక్కటి 1,000 మందికి చొప్పున ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా 15 డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు పని చేస్తుండగా రెండేళ్లలో ఉపాధి పొందే వారి సంఖ్య 15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కొసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలు రూ.22,80,000 కోట్ల మేరకు ఉన్నట్లు వివిధ నివేదికలు అంచనా వేస్తుండగా వచ్చే ఐదేళ్లలో ఇది రూ.152 లక్షల కోట్లకు చేరుతుందని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఈ అవకాశాల్లో మన రాష్ట్రం కనీసం ఒక్క శాతం వాటాను దక్కించుకున్నా రాష్ట్రంలో వ్యాపార పరిమాణం రూ.1,52,000 కోట్లకు చేరుతుందని తద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
సాగర నగరికి అపార అవకాశాలు
విశాఖ డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా ఎదిగేందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. పుష్కలమైన మానవ వనరుల లభ్యతతో పాటు నాస్కామ్ ఐవోటీ, ఎస్‌టీపీఐ ఇండస్ట్రీ నాలుగు రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయడం కలసి వచ్చే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు 20 లక్షల మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సేవలు అందిస్తుండగా ఇందులో ఒక శాతం మందిని ఆకర్షించగలిగినా 20,000 మందికి స్థానికంగా ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం నైపుణ్య శిక్షణను అందజేస్తే రెండేళ్లలోనే వేలాది మందికి స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని పేర్కొంటున్నారు.
మధురవాడలో భారీ క్యాంపస్
విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాం. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ క్యాంపస్ ద్వారా షిఫ్ట్‌కు 7,000 మంది చొప్పున రెండు షిఫ్ట్‌లలో 14,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. దీనికి అదనంగా మధురవాడలో 2.5 లక్షల చదరపు అడుగుల్లో మరో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో డిజిటల్ మార్కెటింగ్ కార్యాలయాలను త్వరలో ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నాం.
– గేదెల శ్రీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్
ప్రభుత్వ తోడ్పాటుతో భారీ అవకాశాలు..
డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, సెర్చింగ్ ఆప్టిమైజ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవారు స్థానికంగా అందుబాటులో లేరు. ప్రభుత్వం చొరవ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ రంగానికి చెందిన మానవ వనరులను అందుబాటులోకి తెస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
– శ్రీధర్ కొసరాజు, ప్రెసిడెంట్, ఐటాప్
Comments
Please login to add a commentAdd a comment