సాక్షి, అమరావతి: కోవిడ్–19 లక్షణాలైన జ్వరం, దగ్గు వంటివి లేకపోయినప్పటికీ అత్యధిక శాతం మందికి పాజిటివ్ వస్తోంది. సీరో సర్వైలెన్స్ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సీరోసర్వైలెన్స్ సర్వేను వైద్యఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ నాలుగు జిల్లాల్లో నమోదైన కేసుల్లో లక్షణాలు కనిపించకుండా అత్యధిక శాతం మందికి కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు వెల్లడైంది. అనంతపురం జిల్లాలో 99.5 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 92.8 శాతం, కృష్ణా జిల్లాలో 99.4 శాతం, నెల్లూరు జిల్లాలో 96.1 శాతం మందికి లక్షణాల్లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే కృష్ణా జిల్లాలో అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 22.3 శాతం మందికి కోవిడ్–19 తెలియకుండానే వచ్చి వెళ్లిపోయింది. అంటే ఆ 22.3 శాతం మందిలో కోవిడ్–19 యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడైంది.
లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్
‘‘ఎటువంటి లక్షణాలు లేకుండా కోవిడ్–19 పాజిటివ్ వచ్చిన వారిని పది రోజుల పాటు హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచుతున్నాం. పది రోజుల్లో తీవ్రత ఆధారంగా జ్వరంగానీ, దగ్గుగానీ వస్తే వాటికి మందులు వాడతారు. లేదంటే బలవర్థకమైన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. పదకొండవ రోజు నుంచి వారు బయట తిరగవచ్చు. ఇక వారి నుంచి వ్యాధి విస్తృతి ఉండదు. వారికి మళ్లీ కోవిడ్–19 పరీక్ష కూడా అవసరం లేదు. ఇలాంటి వారు ఎక్కువ మంది హోం క్వారంటైన్‌లో ఉంటారు’’ అని కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
లక్షణాలుండవ్.. కానీ కరోనా పాజిటివ్
Published Mon, Aug 24 2020 3:35 AM | Last Updated on Mon, Aug 24 2020 3:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment