(కోనసీమ) రాజోలు: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ వివాహిత రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యర్రంశెట్టి విజయలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఆమె విజయలక్ష్మి ఏ1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా, ఆమె భర్త రమేష్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పని చేసుకుంటూ సుమారు రూ.80 లక్షల అప్పులు చేశారు.
కొన్ని బకాయిల నిమిత్తం విజయలక్ష్మి పుట్టిల్లు ఇరుసుమండలో ఉన్న స్థలాన్ని, కేశవదాసుపాలెంలోని డాబా ఇంటిని అమ్మేందుకు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులతో పెద్దల సమక్షంలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా అప్పు ఇచ్చిన కొందరు బకాయి కింద ఇరుసుమండలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, భూసర్వే పనుల్లో వివాదం తలెత్తింది.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు విజయలక్ష్మి తన స్కూటర్‌పై రాజోలు సర్కిల్ పోలీసు కార్యాలయానికి వచ్చింది. వెంట లీటరు బాటిల్‌లో పెట్రోలు పోయించి తెచ్చుకుంది. సర్కిల్ కార్యాలయం ఎదుట సిమెంట్ బల్లపై కూర్చుని సీఐ ఎప్పుడు వస్తారని అక్కడున్న సెంట్రీ కానిస్టేబుల్‌ను అడిగింది. సీఐ శిక్షణలో ఉన్నారని, సోమవారం వస్తారని కానిస్టేబుల్ చెప్పాడు. వెంటనే ఆమె కూడా తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. మంటలు పూర్తిగా వ్యాపించడంతో హాహాకారాలతో పరుగులు తీస్తూ పక్కనే ఉన్న ట్రెజరీ, రెవెన్యూ కార్యాలయాల సమీపానికి వచ్చింది.
అక్కడ ఉన్న పలువురు ఆమెను రక్షించేందుకు తడి గోనె సంచులు, ఇసుక వేసి, మంటలను ఆదుపు చేశారు. హుటాహుటిన రాజోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. డాక్టర్ రాంజీ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేశారు. విజయలక్ష్మి శరీరం సుమారు 80 శాతం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని రాజోలు మెజి్రస్టేట్ జి.సురేష్బాబు నమోదు చేశారు. దీనిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై కృష్ణమాచారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment