ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: బంగారం అమ్మకాల్లో తప్పుడు బిల్లులు సృష్టించి పన్నులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించిన హోల్‌సేల్ వర్తక దుకాణంపై రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు కొరడా ఝుళిపించారు. రూ.50 కోట్ల వరకూ బంగారం కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీల్లో తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు రూ.6,56,08,424 చెల్లించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ వ్యాపార సంస్థ వ్యవహారాన్ని జేసీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ సర్కిల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సుంకర శ్రీలక్ష్మి, ఇంటిలిజెన్స్ విభాగాధికారులు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మదింపు చేస్తూ.. గుట్టురట్టు చేశారు.
ఒడిశాకు చెందిన ట్రిజాల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ హోల్‌సేల్ బంగారు, వెండి వ్యాపార సంస్థ విశాఖలో 2017–18న బ్రాంచ్ ప్రారంభించింది. 2018–19 నుంచి వ్యాపార లావాదేవీలు కొనసాగించింది. ఈ సమయంలో హోల్‌సేల్ ఇన్‌వాయిస్‌లను దుకాణాల పేరుతో కాకుండా వ్యక్తుల పేర్లతో చూపించారు. వీటిలో కూడా ఎస్టిమేషన్ స్లిప్స్‌కు, విక్రయ బిల్లుల్లో ఉన్న మొత్తానికి భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. మొత్తంగా రూ.50 కోట్ల విలువైన బంగారం, వెండి విక్రయాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని జేసీ శ్రీనివాసరావు తెలిపారు. 90 రోజుల్లో జరిమానా మొత్తం చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment