సింగరాయకొండ (మర్రిపూడి): మాతమ్మ తిరునాళ్లకు డబ్బులు చెల్లించని ఆ కుటుంబాలతో మాట్లాడినా.. వారి ఇళ్లకు వెళ్లిన వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని ఆ కాలనీ గ్రామ పెద్దలు దండోరా వేసిన ఘటన సింగరాయకొండ మండలంలోని శానంపూడి పంచాయతీ అరుంధతి నగర్‌లో బుధవారం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం... శానంపూడి గ్రామ పంచాయతీలోని అరుంధతి కాలనీ వాసులు ఇటీవల 5 సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే మాతమ్మ తిరునాళ్ల జరిపారు. తిరునాళ్లకు ఆ కాలనీలోని ప్రతి ఇంటి వారు చందాలు వేసుకుంటారు. అయితే ఆ కాలనీలోని 17 కుటుంబాలవారు చందాలు ఇవ్వకపోవడంతో గ్రామ పెద్దలు తీర్మానం చేసుకుని కాలనీలో దండోరా వేయించారు. ఈ 17 కుటుంబాల వారు చర్చికి కూడా వెళ్లడానికి వీలు లేదని ఆదేశించారు.
దీనిపై ఆయా కుటుంబాల వారు తమకు న్యాయం కావాలని కోరుతూ పోలీస్, రెవెన్యూ శాఖల వారిని ఆశ్రయించారు. దీనిపై పోలీసులు సమస్య పరిష్కారానికి తహశీల్దార్‌ను కలవాలని సూచించడంతో వారు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో తహశీల్దార్ ఉష.. కలెక్టర్ దినేష్‌కుమార్ పాకల గ్రామానికి వస్తున్నారని, తెలియడంతో అక్కడికి వెళ్లారు. దీంతో కార్యాలయ సిబ్బంది గురువారం తహశీల్దార్‌ను కలవాలని వారికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment