మేం చెప్పినట్లే చెప్తావా లేదా? | MD Vasudeva Reddy illegal detentions 3 Days in Hyderabad: AP | Sakshi
Sakshi News home page

మేం చెప్పినట్లే చెప్తావా లేదా?

Published Wed, Jan 8 2025 5:52 AM | Last Updated on Wed, Jan 8 2025 5:52 AM

MD Vasudeva Reddy illegal detentions 3 Days in Hyderabad: AP

బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టికం

3 రోజులు హైదరాబాద్‌లో అక్రమ నిర్బంధం 

ఏపీ ప్రభుత్వ న్యాయవాది నివాసంలో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వేధింపులు 

వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి 

అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఢిల్లీలో పోస్టింగు.. లేకపోతే అంతు చూస్తామని బెదిరింపు 

రిటైర్డ్‌ ఐపీఎస్‌లు ఆర్పీ ఠాకూర్, ఘట్టమనేని శ్రీనివాస్‌ అరాచకం 

పాత్రధారులుగా సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్, సీఐడీ అధికారులు 

నిర్బంధం విషయం మీడియాలో రావడంతో తోక ముడిచిన అధికారులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ రాజ్యాంగ వేధింపులు వెర్రితలలు వేస్తున్నాయి. ఏకంగా సీఐడీ అధికారులనే అధికారిక గూండాలుగా, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులను రాజ్యాంగేతర శక్తులుగా మార్చి మరీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. ఈ అధికారిక గూండాగిరీ తాజాగా రాష్ట్ర బెవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని మూడు రోజులుగా హైదరాబాద్‌ శివార్లలో అక్రమంగా నిర్బంధించి, వేధించింది. వైఎస్సార్‌సీపీ కీలక ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలమిచ్చి, సంతకాలు చేయాలని ఆయనపై ఒత్తిడి తెచి్చంది. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచక శక్తులుగా రూపాంతరం చెందిన రిటైర్డ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తెరవెనుక సూత్రధారిగా, రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ తెరముందు అరాచక శక్తిగా, సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, మరికొందరు అధికారులు పాత్రధారులుగా సాగుతున్న ప్రభుత్వ అధికారిక గూండాగిరీ  ఇలా ఉంది.. 

మూడు రోజులపాటు అక్రమ నిర్బంధం 
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై అక్రమ కేసు పెట్టింది. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కూడా. ఆయన్ని విచారణ పేరుతో సీఐడీ అధికారులు పలుసార్లు వేధించారు. ఆయన నివాసంలో తనిఖీల పేరుతో రాద్ధాంతం చేశారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. తనపై పెట్టిన అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మూడు రోజులుగా వాసుదేవరెడ్డిని హైదరాబాద్‌లో అక్రమంగా నిర్బంధించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన్ని ఎక్కడకు తీసుకువెళ్లారనే కనీస సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆయన మొబైల్‌కు ఫోన్‌ చేస్తే స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడించారు. ఢిల్లీలో ఉన్నానని ఒకసారి, చెన్నైలో ఉన్నానని ఓసారి అబద్ధం చెప్పించారు. ఆయనకు ఎవరు ఫోన్లు చేస్తోంది, వారేం మాట్లాడుతోందీ అన్నీ ఘట్టమనేని శ్రీనివాస్, ఇతర సీఐడీ అధికారులు వింటున్నారు.  

వైఎస్సార్‌సీపీ ఎంపీల పేర్లు చెప్పాలని వేధింపులు 
వాసుదేవరెడ్డిని హైదరాబాద్‌లోని ఓ గుర్తు తెలియని ఫామ్‌ హౌస్‌లో నిర్బంధించినట్లు సమా­చా­రం. ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి చెందిన హైదరాబాద్‌లోని నివాసానికి తీసుకువెళ్లి ఎలా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలో వివరించి, అలాగే చెప్పాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు.  ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి పేర్లు చెప్పాలంటూ వేధించారు. తాము చెప్పినట్టు చేస్తే ఢిల్లీలో గుర్తింపు ఉన్న పోస్టింగు ఇప్పిస్తామని ప్రలోభ పెట్టారు. ఇందుకు వాసుదేవరెడ్డి సమ్మతించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల కోసం లిక్కర్‌ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. 

దాంతో ఆయనపై సీఐడీ అధికారులు విరుచుకుపడ్డారు. ‘వైఎస్సార్‌సీపీ ఎంపీల పేర్లను ప్రస్తావిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తాం. అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా ఎవరికీ తెలియకుండా చేస్తాం’ అంటూ బెదిరించారు. వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపుల సమాచారం టీవీ చానళ్లు మంగళవారం సాయంత్రం నుంచి ప్రసారం చేయడంతో సీఐడీ అధికారులు తోక ముడిచారు. ఆయన్ని ప్రస్తుతానికి విడిచిపెట్టినట్టు తెలుస్తోంది.  

హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీలను ఆశ్రయించనున్న కుటుంబ సభ్యులు 
వాసుదేవరెడ్డి అక్రమ నిర్బంధం, వేధింపులపై హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆశ్రయించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రిటైర్డ్‌ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌తోపాటు సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఇతర సీఐడీ అధికారులు ఆయన్ని అక్రమంగా నిర్బంధించి వేధించారని కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. అన్ని వివరాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వాసుదేవరెడ్డికి ఏపీ సీఐడీ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారుల నుంచి ఎలాంటి హానీ కలగకుండా రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. 

ఏపీ ప్రభుత్వం సీఐడీ అధికారుల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏదైనా కేసును చట్టపరంగా దర్యాప్తు చేయాలి తప్ప సీఐడీ అధికారులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయభ్రాంతులకు గురి చేయడమేమిటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారులను అనధికారిక గూండాలుగా ప్రభుత్వం వాడుకోవడం విభ్రాంతి కలిగిస్తోందని విమర్శిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement