సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వాటికి మరింత పదును పెడుతోంది. నాడు–నేడు కింద ఇప్పటికే రూ.16వేల కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో పాటు, ప్రస్తుతమున్న ఆస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్న విషయం తెలిసిందే.
అలాగే, 40 వేలకు పైగా పోస్టుల భర్తీని చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా పలు సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వాటి పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తూ నిర్ధేశిత జాబ్‌చార్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా బోధనాస్పత్రులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
పేషెంట్ కేర్, క్లినికల్ కార్యకలాపాలపై..
రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు నడుస్తున్నాయి. స్పెషలిస్టు వైద్య సేవల కోసం రోజూ వేలాది మంది రోగులు ఇక్కడకు వస్తుంటారు. ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా బోధనాస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణ, వసతులు, అందుబాటులో వైద్యులు–సిబ్బంది తదితర అంశాల్లో లోటుపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి.
వీటిని చక్కదిద్దడం కోసం ఆస్పత్రి నిర్వహణ, పర్యవేక్షణ విధుల్లో అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటి డైరెక్టర్‌లు, ఏఓలను భాగస్వామ్యం చేస్తూ జాబ్‌చార్ట్ సిద్ధంచేస్తున్నారు. వీరిని భాగస్వామ్యులు చేయడం ద్వారా పేషెంట్ కేర్, క్లినికల్ కార్యకలాపాలపై సూపరింటెండెంట్‌లు, ఆర్‌ఎంఓలు దృష్టి కేంద్రీకరించేలా చర్యలు చేపడుతున్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు
మరోవైపు.. వైద్య, ఆరోగ్య శాఖలోని డీఎంఈ విభాగంలో బయోమెట్రిక్ హాజరు విధానం ఇంకా గాడినపడలేదు. ఈ విభాగంలో 15 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల వరకూ చాలామంది ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరువేయడంలో ఎన్‌రోల్ కాలేదు. ఈ నేపథ్యంలో.. డీఎంఈ కార్యాలయంలో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసి ఉన్నతాధికారులు బయోమెట్రిక్ హాజరును పర్యవేక్షిస్తున్నారు.
దీనికితోడు.. ఇటీవల కాలంలో ఆస్పత్రుల్లోని సెక్యూరిటీ, శానిటేషన్, పెస్టిసైడ్ కంట్రోల్ కార్మికులను కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడంలేదన్న ఫిర్యాదులు అధికారులు, వైద్యశాఖ మంత్రికి అందాయి. దీంతో.. వీరికి కూడా ఫేషియల్ రికగ్నిషన్ హాజరును అమలుచేయనున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తరహాలో శానిటేషన్, పెస్టిసైడ్ కంట్రోల్, సెక్యూరిటీ ఉద్యోగుల నుంచి రోజూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు చర్యలు తీసుకుంటున్నారు. వీరందరి వివరాలు సేకరించి అంతా ఎన్‌రోల్ అయ్యారో లేదో అన్నది పర్యవేక్షిస్తున్నారు.
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఆస్పత్రుల నిర్వహణ, పర్యవేక్షణలో ప్రస్తుతమున్న లోపాలను సరిదిద్దుతున్నాం.
ఆయా అధికారులు, ఉద్యోగులకు జాబ్‌చార్ట్‌లు రూపొందిస్తున్నాం. వైద్యులు, వైద్య సిబ్బంది పనివేళల్లో విధిగా ఆస్పత్రిలో అందుబాటులో ఉండాల్సిందే. ప్రతిఒక్కరూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరు వేయాల్సిందే. కుంటి సాకులతో పనివేళల్లో ఎవరైనా ఆస్పత్రుల నుంచి బయటకు వెళ్తే చర్యలు తీసుకుంటాం.
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment