
ఓపీ రిజిస్ట్రేషన్ కోసం విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్
సాక్షి, అమరావతి: ప్రస్తుత డిజిటల్ యుగంలో అగ్గిపెట్టె నుంచి ఆడి కారు కొనుగోలు వరకూ ఆర్థిక లావాదేవీలు మొబైల్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకు ఖాతా నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్‌తో పనిలేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బులు పంపుతున్నారు. ఇదే తరహాలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అవుట్ పేషెంట్ (ఓపీ) రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్టర్ అపాయింట్‌మెంట్‌కు టోకెన్ పొందే వెసులుబాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తోంది. దక్షిణాదిలో తొలిసారిగా ఈ సేవలు విజయవాడ జీజీహెచ్‌లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ విధానంపై ఆస్పత్రిలో రిసెప్షన్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు క్యూఆర్ కోడ్ హోర్డింగ్స్, ఓపీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను అమర్చారు.
ఏమిటి లాభం?
సాధారణంగా ఎవరైనా వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే తొలుత ఓపీ కౌంటర్‌లో వివరాలను నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించాలి. అనంతరం సంబంధిత విభాగానికి రోగిని రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోగులు గంటల తరబడి క్యూలో నిల్చొని పడిగాపులు పడాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేరుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లి టోకెన్ తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. క్యూలైన్‌లో నిరీక్షించే అగచాట్లు తప్పుతాయి.
దేశానికి ఆదర్శంగా ఏపీ
ప్రజలకు కాగిత రహిత వైద్య సేవలు అందించడంలో ఏపీ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీ విధానాలను మార్గదర్శకంగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) డైరెక్టర్ కిరణ్ గోపాల్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3.50 కోట్ల మందికి ఆభా ఐడీలు సృష్టించారు. వీటిని ఆయా వ్యక్తుల ఆరోగ్య రికార్డులతో అనుసంధానించడంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. డిజిటల్ హెల్త్ సేవల్లో దేశంలోనే టాప్‌లో ఉన్న మన రాష్ట్రాన్ని పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం వరించాయి.
మిగిలిన ఆస్పత్రులకూ విస్తరిస్తాం
విజయవాడ జీజీహెచ్‌లో ఈ వారం క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం. అనంతరం మిగిలిన ఆస్పత్రులకు సేవలను విస్తరిస్తాం. డిజిటల్ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళుతోంది. ప్రతి వ్యక్తి ఆభా ఐడీని వారి ఆరోగ్య రికార్డులతో అనుసంధానిస్తున్నాం. తద్వారా ఆ వ్యక్తి దేశంలో ఎక్కడికి వెళ్లిన ఆరోగ్య చరిత్ర వివరాలన్నీ ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వస్తాయి.
– జి.ఎస్.నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర డిజిటల్ హెల్త్
ఇదీ నమోదు విధానం..
► స్మార్ట్ ఫోన్ ద్వారా ఆస్పత్రిలో ప్రదర్శించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
► వెంటనే యూఆర్‌ఎల్ కోడ్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఆభా, ఇతర భాగస్వామ్య యాప్‌లు పేటీఎం, డ్రిఫ్కేస్, ఆరోగ్యసేతు, ఎక కేర్ లాంటి యాప్‌లు కనిపిస్తాయి.
► ఒకవేళ ఇప్పటి వరకూ ఆ యాప్‌లు ఫోన్‌లో లేకుంటే ప్లేస్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్(ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి.
► యాప్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఆభా వివరాలు ప్రత్యక్షం అవుతాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టోకెన్ 30 నిమిషాల పాటు వ్యాలిడిటీలో ఉంటుంది.
► టోకెన్ నెంబర్ వచ్చాక ఆస్పత్రిలో కౌంటర్‌కు వెళ్లి ఆభా గుర్తింపు నెంబర్, ఫోన్ నెంబర్ తెలియచేసి ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే రిసెప్షన్ సిబ్బంది స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని నేరుగా డాక్టర్‌ను సంప్రదించవచ్చు.