సాక్షి, హైదరాబాద్: రోగులపట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డిస్మిస్ చేయడానికి కూడా వెనుకాడబోమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణించామని.. అటువంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్.. టువార్డ్స్ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. అన్ని వయసుల వారికీ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్ కేటాయించిందని... ఈ కేటాయింపులతో తలసరి హెల్త్ బడ్జెట్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ పేర్కొనే డబుల్ ఇంజన్ సర్కారున్న ఉత్తరప్రదేశ్ ఈ ర్యాంకుల్లో చివరి స్థానంలో నిలిచిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
అలాగే వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ చార్జిïÙట్ విడుదల చేయడాన్ని ఆయన హాస్యాస్పదంగా అభివరి్ణంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు చార్జిషీట్ పేరుతో హడావిడి చేశారని మండిపడ్డారు. వైద్య రంగంపై నీతి ఆయోగ్ విడుదల చేసిన సూచీలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్ 16వ స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 10వ స్థానంలో, హిమాచల్‌ప్రదేశ్ 7వ స్థానంలో నిలిచాయనే విషయాన్ని ఆ పార్టీ నేతలు మరిచిపోయినట్లున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతం గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని... దీనివల్ల అక్కడక్కడా వారు అనారోగ్యం బారినపడుతున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
రాష్ట్రానికి ఎన్నో అవార్డులు...
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు లభించిందని.. యునిసెఫ్ కూడా ఈ సేవలను ప్రశింసించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సంరక్షించడంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ హైదరాబాద్ సెంట్రల్ హబ్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 31 లక్షల మందికి టెలి కన్సల్టెన్సీ ద్వారా వైద్య సేవలు అందించినందుకు కేంద్రం రాష్ట్రానికి అవార్డు ఇచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. పీహెచ్‌సీ, జిల్లా ఆసుపత్రి, యూపీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ ఆష్యురెన్స్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి మూడు కేంద్ర అవార్డులు లభించాయన్నారు. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు వరల్డ్ టీబీ డే సందర్భంగా కేంద్రం అవార్డులు ప్రకటించిందని గుర్తుచేశారు.
గతేడాది 2.59 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు..
ఈ ఏడాది మరిన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు. ఈఎన్‌టీ, సరోజినీదేవి ఆసుపత్రులను మరింత పట్టిష్టం చేస్తామని, ఆహార కల్తీ నియంత్రణపై మరింతగా దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద గతేడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారని, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకంలో 43,702 మంది లబ్ధి పొందారని మంత్రి వివరించారు. గతంలో పరిమితి రూ. 2 లక్షలు ఉంటే దాన్ని రూ. 5 లక్షలకు పెంచామన్నారు. అలాగే అవయవ మారి్పడి వంటి శస్త్రచికిత్సల కోసం రూ. 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో కవరేజీ కలి్పస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment