సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వానికి తెలియజేసింది. మరో 7 వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియ వివిధ స్థాయిల్లో ఉంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ రెండు కళాశాలల్లో 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి వచ్చినట్లయింది.
మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, బోధన అధ్యాపకులను పూర్తిస్థాయిలో నియమించుకోవాలని నేషనల్ మెడికల్ కమిషన్ కోరింది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్లు ఎక్కడైనా రుజువైతే అనుమతి రద్దవుతుందని హెచ్చరించింది. కాగా ఆయా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది.
కోర్సులు, అందుబాటులో ఉన్న అధ్యాపకులు, వారి 5 ఏళ్ల అనుభవం, విద్యార్థులు చేరిన అనుబంధ విశ్వవిద్యాలయం మొత్తం సమాచారాన్ని ప్రదర్శించడం తప్పనిసరి చేయాలని పేర్కొంది. ప్రతి స్పెషాలిటీలో అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పరికరాలను కూడా ప్రదర్శించాలని సూచించింది. రెండు వైద్య కళాశాలలకు అనుమతి రావడంపై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి
Published Sun, Apr 9 2023 1:38 AM | Last Updated on Sun, Apr 9 2023 10:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment