సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ (బీ కేటగిరీ 35 శాతం), ఎన్‌ఆర్‌ఐ (సీ కేటగిరీ 15%) కోటా సీట్లను భర్తీ చేయకుండా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సీట్ల భర్తీ ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని తెలిపింది.
అయితే సీట్ల భర్తీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్య కమిషనర్ తదితరులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సదుపాయాలతో ధీటుగా నిర్వహించేలా విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లాల్లో నెలకొల్పిన ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో సీట్లను జనరల్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటాగా విభజిస్తూ ప్రభుత్వం గత నెలలో జీవోలు 107, 108 జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన కోయ శిరీష, ఏలూరుకు చెందిన జతిన్ రాయ్, ఆత్మకూరుకు చెందిన వీణా జ్యోతిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రైవేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకే..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ధీటుగా నూతన వైద్య కళాశాలలను నిలబెట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థల నుంచి రూ.వేల కోట్లను సమీకరించి మరీ నూతన వైద్య కళాశాలలను నిర్మించిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటాల కింద అందిన ఫీజులను ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్‌లో జమ చేసి ఆ మొత్తాలతో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను అత్యుత్తమంగా నిర్వహిస్తామన్నారు.
సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను తీసుకురావడం ఇదే తొలిసారి కాదని, 2017 నుంచి ఇది అమలవుతోందన్నారు. ఇప్పటికే రాజస్థాన్, హరియాణ, గుజరాత్‌లో విజయవంతంగా అమలు చేస్తున్నారని శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు వైద్య కళాశాలల్లో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందులో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద కేంద్రానికి వెళతాయన్నారు.
మిగిలిన 85 శాతం సీట్లలో 50 శాతం సీట్లను జనరల్ కేటగిరీలో ప్రతిభ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ భర్తీ చేస్తామని వివరించారు. ఇవి పోగా మిగిలిన 50 శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తామన్నారు. వీటికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదన్నారు. నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తే అది క్యాపిటేషన్ ఫీజుల కిందకు వస్తుందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్ధించారు.
ఎన్‌ఎంసీ అనుమతి లేకుండానే వర్గీకరించారు..
పిటిషనర్ల తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ సీట్లను మూడు కేటగిరీలుగా విభజించడం అంటే బహిరంగంగా వేలం వేయడమేనన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటాలు తీసుకొచ్చిందన్నారు. దీని వల్ల రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు.
జాతీయ వైద్య కమిషన్ అనుమతి లేకుండా ప్రభుత్వం 3 కేటగిరీలను తీసుకొచ్చిందన్నారు. జనరల్ విభాగంలో ఏడాదికి రూ.15 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విభాగంలో రూ.20 లక్షలను ఫీజుగా నిర్ణయించారన్నారు. కొత్త విధానంలో సీట్లను భర్తీ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment